నక్కజిత్తులు పసిగట్టిన ఎఫ్‌ఏటీఎఫ్: పాక్‌కు లాస్ట్ ఛాన్స్... ఫెయిలైతే బ్లాక్ లిస్టే

By Siva KodatiFirst Published Feb 21, 2020, 6:44 PM IST
Highlights

ఉగ్ర సంస్థలకు కేంద్రంగా, ఉగ్రవాదులకు స్వర్గంగా ఉన్న పాకిస్తాన్‌కు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కమిటీ చివరి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతానికి గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తున్నామని.. జూన్‌లో జరగబోయే సమీక్షా సమావేశం నాటికి తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని పక్షంలో బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తామని హెచ్చరించింది

ఉగ్ర సంస్థలకు కేంద్రంగా, ఉగ్రవాదులకు స్వర్గంగా ఉన్న పాకిస్తాన్‌కు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కమిటీ చివరి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతానికి గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తున్నామని.. జూన్‌లో జరగబోయే సమీక్షా సమావేశం నాటికి తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని పక్షంలో బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తామని హెచ్చరించింది.

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌కు చెందిన ఐసీఆర్‌జీ (ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ రివ్యూ గ్రూప్) ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడి చేసేందుకు కొత్తగా మరో 8 అంశాలతో కూడిన లక్ష్యాన్ని పాక్ ప్రభుత్వం ముందుంచింది.

Also Read:అంతర్జాతీయ వేదికపై విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్... మండిపడుతున్న భారత్

కాగా టర్కీ మినహా ఎఫ్ఏటీఎఫ్ సభ్యదేశాలన్నీ పాకిస్తాన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2018 అక్టోబర్‌‌లో ఎఫ్ఏటీఎఫ్ తొలిసారి పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది. 15 నెలల సమయం ఇచ్చినప్పటికీ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో పాక్ విఫలమైంది.

పై పైన చర్యలతో తప్పించుకోవాలని చూసిన పాకిస్తాన్‌కే ఏజెన్సీ గట్టి హెచ్చరికలు చేసింది. సరిగ్గా ఇదే సమయంలో 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడటంతో ఉగ్రవాదంపై తాము కఠినంగానే ఉన్నామని పాకిస్తాన్ బిల్డప్ ఇచ్చినప్పటికీ ఎఫ్ఏటీఎఫ్ నమ్మలేదు.

Also Read:ఇమ్రాన్‌కు చేదు అనుభవం: కాశ్మీర్‌ భారత్‌దేనంటూ పీవోకే‌లో నినాదాలు

తాజాగా ఇచ్చిన 8 లక్ష్యాల ప్రకారం ఇమ్రాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి నిషేధం విధించిన ముష్కరులపై గట్టి నిఘా ఉంచాలి. వీటిలోనూ విఫలమైతే పాకిస్తాన్‌కు బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పదు. ప్రస్తుతం ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాయి. 

click me!