పాకిస్థాన్ కుట్ర : తెలుగు ఇంజనీర్ ను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం

By telugu teamFirst Published Sep 28, 2019, 2:39 PM IST
Highlights

కులభూషణ్ జాదవ్ తరహాలోనే ఒక తెలుగు ఇంజనీర్ ను కూడా ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే, ఆఫ్గనిస్తాన్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో తెలుగు ఇంజనీర్ వేణుమాధవ్ పనిచేస్తున్నాడు. ఇతను ఆల్ ఖైదా సంస్థకు ఆర్ధిక సహకారం అందిస్తున్నాడని ఆరోపణలు చేసింది

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భారత్ ను అప్రతిష్టపాలు చేసేందుకు పాకిస్తాన్ భారీ కుట్రను పన్నింది. కులభూషణ్ జాదవ్ తరహాలోనే ఒక తెలుగు ఇంజనీర్ ను కూడా ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. 

వివరాల్లోకి వెళితే, ఆఫ్గనిస్తాన్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో తెలుగు ఇంజనీర్ వేణుమాధవ్ పనిచేస్తున్నాడు. ఇతను ఆల్ ఖైదా సంస్థకు ఆర్ధిక సహకారం అందిస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఎప్పుడో 2015లో పెషావర్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడిలో కూడా ఇతని ప్రమేయం ఉందని నిరూపించేందుకు ఏకంగా తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించింది. 

ఇలా భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పాకిస్తాన్ ఈ విషయమై ఒక సంవత్సర కాలంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంవత్సరం మార్చ్ లో అతని పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. అందులో వేణుమాధవ్ తారిఖ్ గిదర్ అనే ఉగ్రావాద సంస్థకు ఆయుధాలు సప్లై చేసినట్టుగా తప్పుడు కేసు బనాయించింది. 

అక్కడితో ఆగకుండా, చైనా సహాయంతో వేణుమాధవ్ పై సృష్టించిన తప్పుడు సాక్ష్యాలను ఉపయోగించి ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు కూడా చేసింది. పాకిస్తాన్ కుయుక్తులను ఒక కంట కనిపెడుతున్న మన దేశం సరైన రీతిలో జవాబిచ్చింది. 

ఆఫ్గనిస్తాన్ లో పనిచేస్తున్న ఈ తెలుగు ఇంజనీర్ ని ఆఫ్గనిస్తాన్ లోని భారత హై కమీషనర్ సహాయంతో సెప్టెంబర్ 7వ తేదీ నాడే భారత దేశానికి వెనక్కి రప్పించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్ చేసిన ఈ ఆరోపణకు దిమ్మతిరిగే రీతిలో భారత దౌత్యాధికారులు సమాధానమిచ్చారు. 

click me!