మోడీ ఐరాస ప్రసంగంలో తమిళ కవి ప్రస్తావన : ఎందుకు?

By telugu teamFirst Published Sep 28, 2019, 11:19 AM IST
Highlights

ఎంతోమంది కవులు, తత్వవేత్తలు ఉన్నా, ప్రధాని ఆ తమిళ కవి గురించి ఎందుకు ప్రస్తావించారు? దీనికి సమాధానం కావాలంటే ఆ కవి రచనల సారాన్ని అర్థం చేసుకోవలిసి ఉంటుంది.

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ 3వేల సంవత్సరాల కిందట జీవించిన తమిళ కవి కనియన్ పుంగుండ్రనార్ భాష్యాలను గురించి ప్రస్తావించారు. ప్రజల్లో ఐక్యమత్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని సూచిస్తూ "మనం అన్ని ప్రాంతాలకు చెందిన వారము, అందరికి చెందినవారము" అని అలనాటి తమిళ కవి మాటలను గుర్తు చేసారు. 

ఎంతోమంది కవులు, తత్వవేత్తలు ఉన్నా, ప్రధాని ఆ తమిళ కవి గురించి ఎందుకు ప్రస్తావించారు? దీనికి సమాధానం కావాలంటే ఆ కవి రచనల సారాన్ని అర్థం చేసుకోవలిసి ఉంటుంది. అతని అన్ని కావ్యాల్లోనూ చెప్పింది ఒక్కటే. ప్రజలంతా సుఖంగా సంతోషంగా జీవించాలంటే వేర్వేరు గుంపులుగా విడిపోకుండా ఒక్కటే నైతిక ధర్మానికి కట్టుబడి ఉండాలని సూచించారు. 

కనియన్ పుంగుండ్రనార్ సంగం కాలం నాటి కవి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 1వ శతాబ్దం కాలానికి చెందిన వ్యక్తి. తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లాలోని మహిబిళం పట్టి అనే గ్రామంలో జన్మించారు. అప్పటి సంగం కాలం కవుల్లో  కనియన్ పుంగుండ్రనార్ ప్రముఖ కవిగా భాసిల్లారు. 

74వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ భారతదేశ గొప్పతనం గురించి ప్రస్తావించారు. సర్వమానవ సౌభ్రాతృత్వం తో భారతదేశం ఎలా విలసిల్లుతో వస్తోందో వారికి వివరించారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, దానికి కట్టుబడి సాగుతున్న భారత దేశ ప్రయాణాన్ని ప్రస్తావించారు. 

భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ వేల ఏళ్లుగా విలసిల్లుతున్న భారతదేశ ఔన్నత్యాన్ని, విభిన్న జాతులు వాటి సాంస్కృతిక సంప్రదాయాల మేళవింపుగా ఉన్న భారతదేశ భిన్నత్వాన్ని ఐరాస వేదికపై ప్రపంచానికి వివరించారు. 

కనియన్ పుంగుండ్రనార్ తోపాటు ఇలానే సర్వమానవ సౌభ్రాతృత్వం గురించి ప్రపంచ శాంతి గురించి స్వామి వివేకానందుడి మాటలను కూడా ఆ వేదికపై వినిపించారు. నిన్న శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశంలో మోడీ ప్రసంగించారు. వారంపాటు సాగిన మోడీ అమెరికా పర్యటన ఈ సభతో ముగియనుంది.  

click me!