ఆఫ్ఘనిస్తాన్: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్ల వెనుక పాక్.. ఐసిస్ ఉగ్రవాదులకు వెన్నుదన్ను

By Siva KodatiFirst Published Aug 29, 2021, 3:33 PM IST
Highlights

పాక్‌లోని పెషావర్, క్వెట్టా నుంచే ఐసిస్ కేకి పేలుడు పదార్థాలు అందాయని కాబూల్ లోని ఆఫ్ఘన్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఏఐఎస్ఎస్) నివేదికలో పేర్కొంది. తలపాగాలు, కూరగాయల బండ్లలో పేలుడు పదార్థాలను పెట్టి సరిహద్దులను దాటించిందని, ఐసిస్ కు వాటిని అందించిందని వెల్లడించింది.
 

కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో దాదాపు 200 మంది ప్రజలు మరణించారు. ఈ మారణకాండకు కారణమైన ఐసిస్ కే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ కుట్రకు సూత్రధారిగా వున్న వ్యక్తిని డ్రోన్ దాడుల్లో అగ్రరాజ్యం హతమార్చింది. అయితే కాబూల్ పేలుళ్లకు పాకిస్థాన్ కు సంబంధాలున్నాయా? అత్యంత భయంకరమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దాయాది దేశం తోడ్పాటునందిస్తోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అక్కడ జరిగిన పేలుళ్లలో వాడిన ఆర్డీఎక్స్ పాకిస్థాన్ నుంచే సరఫరా అయిందని ఆఫ్ఘనిస్థాన్ నిపుణులు చెబుతున్నారు.

పాక్‌లోని పెషావర్, క్వెట్టా నుంచే ఐసిస్ కేకి పేలుడు పదార్థాలు అందాయని కాబూల్ లోని ఆఫ్ఘన్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఏఐఎస్ఎస్) నివేదికలో పేర్కొంది. తలపాగాలు, కూరగాయల బండ్లలో పేలుడు పదార్థాలను పెట్టి సరిహద్దులను దాటించిందని, ఐసిస్ కు వాటిని అందించిందని వెల్లడించింది. పేలుడు పదార్థాలతో పాటు డబ్బును కూడా పంపిస్తున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది. 

ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పాటు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ఏఐఎస్ఎస్ ఈ సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ముఠాలో 90 శాతం మంది పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన వారేనని పేర్కొంది. తమ ఆయుధాలన్నీ పాకిస్థాన్ నుంచే వస్తున్నట్టు ఐసిస్ ఉగ్రవాదులు చెప్పారని నివేదికలో వెల్లడించింది. ఐసిస్ ముఠాకు పాక్ అండగా నిలుస్తోందంటూ వారు చెప్పారని పేర్కొంది

click me!