Pakistan School Bus Blast: పాక్ లో స్కూల్ బస్సు బ్లాస్టు

Published : May 21, 2025 11:54 PM IST
Pakistan School Bus Blast Kills 6 Injures 38 Balochistan

సారాంశం

Pakistan School Bus Blast: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో స్కూల్ బస్సులో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు మరణించగా, 38 మంది గాయపడ్డారు. బాధితుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు.

Pakistan School Bus Blast: పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోరమైన బాంబు పేలుడు జరిగింది. ఒక స్కూల్ బస్సు టార్గెట్ గా జరిగిన దాడిలో నలుగురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు. మరో 38 మంది గాయపడ్డారు. 

ఖుజ్దార్‌లోని ప్రభుత్వ అధికారి యాసిర్ ఇక్బాల్ దష్తి మాట్లాడుతూ..  ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సుపై ఖుజ్దార్ జిల్లాలో ఈ దాడి జరిగిందని చెప్పారు.
బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బగ్టి మాట్లాడుతూ.. ఈ పేలుడుకు వాహనంలో అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) కారణమని తెలిపారు. బస్సు డ్రైవర్, అతని అసిస్టెంట్ బాధితుల్లో ఉన్నారు. బస్సులో 46 మంది విద్యార్థులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను చికిత్స నిమిత్తం అధికారులు క్వెట్టాకు తరలించారని అల్ జజీరా పేర్కొంది. 

"తీవ్రంగా గాయపడిన పిల్లలను ఖుజ్దార్ నుండి క్వెట్టాకు తరలిస్తున్నాం" అని బగ్టి అన్నారు. దాడి పై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. కాగా, ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటామన్నారు. కాగా, పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

2014 డిసెంబర్‌లో, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సాయుధ బృందం దాడి చేసి 140 మందికి పైగా పిల్లల ప్రాణాలు తీసుకుంది. ఖనిజాలు, సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్, పాకిస్తాన్ నుండి విడిపోవాలని డిమాండ్ చేస్తున్న బలూచ్ వేర్పాటువాదులు, ప్రభుత్వం మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న సంఘర్షణకు నిలయంగా ఉంది. 

బలూచిస్తాన్‌లోని క్విల్లా అబ్దుల్లాలోని ఒక మార్కెట్ సమీపంలో జరిగిన కారు బాంబు దాడిలో నలుగురు మరణించిన కొద్ది రోజుల తర్వాత బుధవారం ఈ దాడి జరిగింది. ఇదిలా వుండగా, బీఎల్ఏ బృందం పాకిస్తాన్ సైన్యం, దాని సహకారులపై మరిన్ని దాడులు చేస్తామనీ, శాంతియుత, సంపన్న, స్వతంత్ర బలూచిస్తాన్‌కు పునాది వేయడం తమ లక్ష్యమని ప్రకటించింది.

PREV
Read more Articles on
click me!