పాక్‌లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్: ఇమ్రాన్ సీరియస్

By Siva KodatiFirst Published Mar 24, 2019, 5:01 PM IST
Highlights

హోలీ రోజున ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి, ఆపై వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. 

పాకిస్తాన్‌లో హిందువులపై దురాగతాలు కొనసాగుతూనే ఉన్నాయి. మైనారిటీ వర్గంగా ఉన్న వీరిపై తరచుగా దాడులు, బలవంతపు మత మార్పిడిలు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా హోలీ రోజున ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి, ఆపై వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

సింధ్ ప్రావిన్స్‌లోని గోట్కీ జిల్లాలో నివసించే రీనా, రవీనా అక్కాచెల్లెళ్లు. కొందరు వ్యక్తులు హోలీ రోజున వారి ఇంటి నుంచి బాలికలను కిడ్నాప్ చేశారు. అనంతరం వీరిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి.. వివాహాలు జరిపిస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో పాక్‌లో ఉన్న హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

అయితే ఈ వీడియోలో రీనా, రవీనా మాట్లాడుతూ... తమను ఎవరూ బలవంతం చేయలేదని, తమ ఇష్టపూర్వకంగానే ఇస్లాం మతం స్వీకరించి పెళ్లిళ్లు చేసుకున్నామంటూ చెప్పడం కనిపించింది.

దీనిపై హిందూ సంఘాలు రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేయడంతో విషయం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. వెంటనే ఈ సంఘటనకు సంబంధించి విచారణ జరిపించాల్సిందిగా సంబంధిత మంత్రిత్వశాఖను ఆదేశించారు.

మరోవైపు దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. పూర్తి వివరాలతో నివేదిక అందించాల్సిందిగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌ను కోరారు. 

click me!