
పాకిస్తాన్ ప్రస్తుతం విపత్కర పరిస్ధితుల్లో వుందన్నారు ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. నిజాయితీగా పనిచేస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని.. పాక్‌లో అందరికీ సమాన హక్కులు కావాలని ఆయన అన్నారు. అమెరికా కోసం తాము ఎంతో త్యాగం చేశామని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. కానీ... పాక్‌ను అమెరికా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత జిహాదీ గ్రూప్‌లు పాక్‌కు వ్యతిరేకంగా మారాయని.. ఎవరికీ గులాంగిరీ చేయాలని ఇస్లాంలో లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. గులాం చేయడం పాపమని.. కానీ, కొందరు డబ్బు, అధికారం కోసం దిగజారిపోయారని ఆరోపించారు. తనను పదవిలోంచి దించడం వెనుక విదేశీ శక్తుల కుట్ర వుందని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు ఎవరికీ తలవంచలేదన్నారు.
కాగా.. పాకిస్థాన్‌లో (pakistan) రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై (imran khan) ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (no-confidence motion) నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే డిప్యూటీ స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో పాకిస్తాన్ పార్లమెంట్ ఏప్రిల్ 3కు వాయిదా పడింది. మరోవైపు... అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పావులు కదుపుతున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే దీనిని ప్రతిపక్షాలు తిరస్కరించాయి.
మిత్రపక్షాల మద్ధతు కోల్పోయిన నేపథ్యంలో బలపరీక్ష జరిగితే ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగానే కన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయ అనిశ్చితికి చెక్ పెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రతిపాదన చేశారు. విపక్షాలు అవిశ్వాసాన్ని ఉపసంహరించుకున్నట్లయితే తాను జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్‌కు సందేశం పంపినట్లు పాకిస్థాన్ జియో న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. ఒకవేళ ఈ ఆఫర్‌కు ప్రతిపక్షాలు అంగీకరిస్తే పాకిస్థాన్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అయితే విపక్షాలు మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లుగాత తెలుస్తోంది. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధి షాజియా మారీ తెలిపినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 172 మంది సభ్యుల ఓట్లు అవసరం. సొంతపార్టీలోని 12 మంది, మిత్రపక్షం ఎక్యూఎంకు (Muttahida Qaumi Movement (MQM) చెందిన ఏడుగురు విపక్షాలకు మద్దతు ఇవ్వడం ఇమ్రాన్ కు ఇబ్బందికరంగా మారింది. ఇదే సమయంలో ఇమ్రాన్ ను ప్రధాని పదవి నుంచి దింపడానికి అవసరమైన మద్ధతును విపక్షాలు కూడగడుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోనూ (Pakistan Tehreek-e-Insaf) అసమ్మతి గళం వినిపిస్తుండటం ఆయనకు ప్రధాన ప్రతిబంధకంగా మారింది. వీటన్నింటికి మించి పాక్ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషించే సైన్యం మద్దతు కోల్పోవడంతో ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతకుముందు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో (Pakistan National Assembly) ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు సోమవారం ప్రవేశపెట్టాయి. దిగువ సభలో ఈ తీర్మానాన్ని పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్ ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మాన ప్రవేశానికి అనుమతి తీసుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి 161 మంది నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరీ సభను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.