మసూద్, సయీద్ జాగ్రత్త.. బయట తిరక్కండి: ఉగ్రవాదులకు పాక్ సూచనలు

By Siva KodatiFirst Published Feb 22, 2019, 9:28 AM IST
Highlights

అంతర్జాతీయ ఉగ్రవాదులకు, టెర్రరిస్టు సంస్థలకు స్వర్గధామంగా భాసిల్లుతున్న పాకిస్తాన్‌పై పుల్వామా దాడి తర్వాత ఒత్తిడి ఎక్కువైంది. ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బుకాయించారు

అంతర్జాతీయ ఉగ్రవాదులకు, టెర్రరిస్టు సంస్థలకు స్వర్గధామంగా భాసిల్లుతున్న పాకిస్తాన్‌పై పుల్వామా దాడి తర్వాత ఒత్తిడి ఎక్కువైంది. ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బుకాయించారు.

అయితే పుల్వామా దాడి తమ పనేనంటూ జైషే మహ్మద్ సంస్థ ప్రకటించింది.. ఈ సంస్థ పాకిస్తాన్‌ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. దీంతో ఆ దేశం అడ్డంగా దొరికిపోయింది.

జైషే చీఫ్ మసూద్ అజహర్ కోసం భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ భద్రతా సంస్థలు వెతుకుతున్నాయి. దీంతో తమ ఉగ్ర మిత్రులకు పాకిస్తాన్ జాగ్రత్తలు చెప్పింది.

అంతర్జాతీయంగా పుల్వామా దాడిపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయని, పరిస్ధితులు చక్కబడే వరకు బయటకు రావొద్దంటూ జైషే చీఫ్ మసూద్ అజహర్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయిద్‌లకు పాకిస్తాన్ ఆర్మీ సూచించింది.

బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని, ఎలాంటి ప్రసంగాలు చేయరాదంటూ మిలటరి కోరింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఐక్యరాజ్యసమతిలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతీసారి చైనా అడ్డుకుంటోంది.

అయితే ఈ సారి మాత్రం చైనా, పాకిస్తాన్ ఆటలు సాగే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా, ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాలు భారత్‌కు మద్దతుగా నిలబడ్డాయి.
    
 

click me!