
న్యూఢిల్లీ: కరోనా(Coronavirus) మహమ్మారి ఎప్పటికప్పుడు పరిణామం చెందుతూ విశ్వరూపం చూపిస్తున్నది. కొత్త కొత్త రూపాలు దాలుస్తూ బెంబేలెత్తిస్తున్నది. పది వారాల క్రితం దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)గా కనిపించిన ఈ వైరస్ ప్రపంచాన్ని మరోసారి ఆంక్షల వలయంలోకి నెట్టింది. అంతకు ముందటి వేరియంట్ డెల్టా(Delta) కంటే వేగంగా వ్యాప్తి చెందుతూ అన్ని దేశాలను మరోసారి ప్రమాదపు అంచుల్లోకి తీసుకెళ్లింది. వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నప్పటికీ సివియారిటీ కొంత తక్కువగా ఉంటుందన్న అధ్యయనాలు కాస్త ఊపిరిపీల్చుకునే వెసులుబాటు ఇచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ ఒమిక్రాన్ వేరియంట్‌లోనే మరో సబ్‌వేరియంట్(BA.2) పంజా విసరడానికి సిద్ధమైంది. ఈ సబ్ వేరియంట్ BA.2 (Sub Variant) అసలైన ఒమిక్రాన్ వేరియంట్ కంటే కూడా వేగంగా వ్యాప్తి(Infectious) చెందే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ తరహా ఇది కూడా స్వల్ప తీవ్రతను కలిగి ఉంటుందని చెప్పలేమని, అది తేల్చడానికి ఇంకొంత డేటా, సమయం పడుతుందని వివరించింది. ఇప్పటి వరకు ఈ సబ్ వేరియంట్ 57 దేశాల్లో గుర్తించామని తెలిపింది.
గత నెల సేకరించిన సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ అవుతున్న కరోనా కేసుల్లో 93 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా నమోదు అవుతున్నట్టు తెలుస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఒమిక్రాన్ వేరియంట్‌లోనూ BA.1, BA.1.1, BA.2, BA.3 సబ్ లీనియేజ్ వేరియంట్లు ఉన్నాయని తెలిపింది. గ్లోబల్ సైన్స్ ఇనీషియేటివ్ జీఐఎస్ఏఐడీలో అప్‌లోడ్ చేసిన ఒమిక్రాన్ సీక్వెన్స్ అప్‌లోడ్ సమాచారం చూస్తే.. ఆ ఒమిక్రాన్ కేసుల్లోనూ ఎక్కువగా BA.1, BA.1.1 కేసులే ఎక్కువగా ఉన్నట్టు వివరించింది. అయితే, కొన్ని దేశాల్లో BA.2 సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు కనిపించిందని పేర్కొంది. ఆ దేశాల్లోని మొత్తం కేసుల్లో సగం మేరకు ఈ సబ్ వేరియంట్ కేసులే ఉన్నాయనీ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో టాప్ ఎక్స్‌పర్ట్ మారియా వ్యాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ, సబ్ వేరియంట్‌కు సంబంధించిన సమాచారం చాలా స్వల్పంగానే ఉన్నదని వివరించారు. కానీ, ప్రాథమిక సమాచారం మాత్రం BA.1 కంటే BA.2 సబ్ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తున్నదని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సాధారణంగా తక్కువ సివియారిటీ కలిగిస్తుందని తెలుసు అని, కానీ, ఈ BA.2 సబ్ వేరియంట్‌లో ఈ సివియారిటీలో ఏదైనా మార్పు ఉంటుందా? అనేది ఇప్పుడే తేల్చలేమని చెప్పారు.
కాబట్టి, ఏ దేశమైనా ఇప్పుడే తాము కరోనా మహమ్మారి విజయం సాధిస్తామని భావిస్తే.. అది కచ్చితంగా తప్పేనని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ తెలిపారు. ఈ వైరస్ చాలా డేంజర్ అని, మన కళ్ల ముందే ఇది పరిణామం చెందుతూ దాని విలయతాండవం కొనసాగిస్తూనే ఉన్నదని వివరించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్‌లో నాలుగు సబ్ లీనియేజ్‌లు కనిపించాయని పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం కరోనా వివరాలపై బులెటిన్(Health Ministry Corona Bulletin) విడుదల చేసింది. దీని ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,61,386 కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. 24 గంటల్లో 2,81,109 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్టు తెలిపింది. కాగా, 1,733 మంది కరోనా పేషెంట్లు మరణించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది.