Coronavirus: గత నెల రోజులతో పోలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం కొద్దిమేర తగ్గింది. అయితే, తూర్పు యూరప్ లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూ.. ఒమిక్రాన్ ముప్పు ఇప్పుడే తగ్గిపోలేదని పేర్కొంది.
Coronavirus:2019లో చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి అతి తక్కువ కాలంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ఇప్పటికీ తన ప్రభావాన్ని పెంచుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. పలు దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి. అయితే, కరోనా ప్రభావం ఇంకా తగ్గిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. Omicron చివరి వేరియంట్ కాదు..తదుపరి వేరియంట్ మరింత వ్యాప్తి కలిగించే... ప్రమాదకరమైనవి అయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
కరోనావైరస్ ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం యూరోపియన్ (Europe) దేశాల్లో ఇంకా కొనసాగుతున్నదని తెలిపింది. కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దనీ, ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు తగ్గిపోలేదని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ కొత్త కోవిడ్-19 వేవ్ ఐరోపాకు తూర్పు వైపు కదులుతున్నట్లు WHO తెలిపింది. ఈ పరిస్థితులు దారుణంగా మారకుండా.. కోవిడ్-19 కట్టడి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని తెలిపింది. అందరికీ కోవిడ్-19 టీకాలు అందేలా చూడాలని సూచించింది. గత రెండు వారాల కరోనా వైరస్ గణాంకాలను గమనిస్తే.. ఆర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, జార్జియా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో కోవిడ్-19 కొత్త కేసులు రెండింతలు పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో తెలిపారు. రోజువారీ కేసులే తగ్గుతూ ఉంటే వచ్చే నెలలో ఇప్పటికీ కొనసాగుతున్న కోవిడ్ ఆంక్షలను సడలించాలని అనేక యూరోపియన్ దేశాలు సూచించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యత సంతరించుకుంది.
World Health Organization (WHO) యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ క్లూగే మాట్లాడుతూ.. మున్ముందు తూర్పు యూరప్ దేశాల్లో మరింతగా విజృంభించకుండా తీసుకునే ముంతు జాగ్రత్త చర్యల్లో కోవిడ్-19 పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించడం, భౌతిక దూరం, మాస్కులు ధరించడం కీలకమని పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ ప్రాంతంలో ఇప్పటివరకు 165 మిలియన్లకు పైగా COVID-19 కేసులు నమోదయ్యాయి. గత వారంలో ఏకంగా 25,000 మంది మరణించారు. "ఓమిక్రాన్ టైడల్ వేవ్‌ను ఎదుర్కొంటున్నప్పుడు.. డెల్టా ఇప్పటికీ తూర్పున విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో.. మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి ఈ ప్రాంతం దిశగ కదులుతున్న పరిస్థితులను గమనిస్తే.. ఇప్పుడే కోవిడ్ ఆంక్షలు ఎత్తివేతకు సరైన సమయం కాదు" అని క్లూగే చెప్పారు. తక్కువ టీకా రేటుకు స్థానిక కారణాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. బోస్నియా మరియు హెర్జెగోవినా, బల్గేరియా, కిర్గిజ్‌స్థాన్, ఉక్రెయిన్ మరియు ఉజ్బెకిస్తాన్‌లలో 60 సంవత్సరాలు పైబడిన వారిలో 40 శాతం కంటే తక్కువ మంది తమ కోవిడ్-19 వ్యాక్సిన్లను అందుకున్నారని చెప్పారు.