డెల్టా కంటే ఒమిక్రాన్ వల్లే ఎక్కువ మరణాలు.. అమెరికాలో ప్రాణాలు కబళిస్తున్న కొత్త వేరియంట్

Published : Jan 29, 2022, 08:46 PM IST
డెల్టా కంటే ఒమిక్రాన్ వల్లే ఎక్కువ మరణాలు.. అమెరికాలో ప్రాణాలు కబళిస్తున్న కొత్త వేరియంట్

సారాంశం

తమ దేశంలో డెల్టా వేరియంట్ కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్ వల్లే ఎక్కువ మరణాలు చోటుచేసుకునేలా ఉన్నాయని అమెరికా నిపుణులు చెబుతున్నారు. డెల్టా సమయంలో ఒక రోజులో గరిష్టంగా 2100 మరణాలు చోటుచేసుకున్నాయని, గత గురువారం ఈ రికార్డును దాటేస్తూ 2200లకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయని వివరిస్తున్నారు. ఒమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే అని అనుకోరాదని, లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నా కబళిస్తున్నదని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో మరణాలను పది లక్షల మార్కును ఈ వేరియంట్ దాటించేలా ఉన్నదని పేర్కొంటున్నారు.  

న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్‌(Delta Variant)తో ప్రపంచమంతా చీకట్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. తెల్లారితే ఎవరు బతుకుతారో.. ఎవరు మరణిస్తారో అనేంత అనిశ్చితికి ప్రపంచాన్ని నెట్టేసింది ఆ వేరియంట్. అప్పటి దుర్భర పరిస్థితులను ఇంకా ఎవరూ పూర్తిగా మరచిపోలేదు. తొలిసారి దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కనిపించగానే మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది. డెల్టా లాంటి ప్రాణాంతక(Fatal) గడియలను చవిచూడాల్సి వస్తుందా? అనే ఆందోళనలను మోసింది. కానీ, డెల్టా కంటే సీరియస్ కాదని, లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని కొన్ని పరిశోధనాత్మక కథనాలు రావడంతో ఊపిరి పీల్చుకున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ గురించి రెండు వైపుల నుంచీ వాదనలు వస్తున్నాయి. డెల్టా అంతటి ప్రమాదకారి కాదని, అంతటి తీవ్ర లక్షణాలు ఒమిక్రాన్‌లో లేవని, హాస్పిటల్స్‌లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందనే వాదనలు ఒక కోణం నుంచి వస్తున్నాయి. కాగా, ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) వేగంగా వ్యాప్తి చెందేదని, మనిషి కరోనా బారిన పడి సహజంగా కూడగట్టుకున్న వ్యాధి నిరోధక శక్తిని, టీకా సామర్థ్యాన్ని కూడా అది తప్పించుకునే శక్తిని కలిగి ఉన్నదని మరో కోణం నుంచి వాదనలు వస్తున్నాయి.

ఈ రెండు వాదనలు సరైనవే అయినా.. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడానికి మొదటి వాదాన్నే ఎక్కువగా చర్చిస్తుంటారు. కొంత ధైర్యాన్ని కూడదీసుకుని కాలాన్ని గడుపుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం ఆందోళన పడకుండా ఉండలేని పరిస్థితి. ఒమిక్రాన్ వేరియంట్‌తో స్వల్ప లక్షణాలు ఉంటాయి కానీ, అవి కేవలం స్వల్ప లక్షణాలే అని కొట్టి పారేయరాదని అమెరికా(America) నిపుణులు చెబుతున్నారు. హాస్పిటల్ అడ్మిషన్ల(Hospitalisation) శాతం తక్కువగా ఉంటుందని చెప్పినా.. వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం కారణంగా కేసులు డెల్టా కంటే గణనీయంగా పెరగడంతో శాతంలో తక్కువే అయినా.. మొత్తంగా చూసుకుంటే హాస్పిటల్‌లలో చేరే వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. ఇప్పుడు ఈ విషయాలనే అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ను లైట్‌గా తీసుకోవద్దని, సరిగ్గా చెప్పాలంటే.. డెల్టా కంటే కూడా.. ఒమిక్రాన్ వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయని పేర్కొంటున్నారు. అంతేకాదు, డెల్టా ప్రబలిన సమయంలో నమోదైన గరిష్ట మరణాల సంఖ్యను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ మరణాలు దాటేశాయని చెప్పడం గమనార్హం.

రోజువారీగానే కాదు.. వారాల వారీగా చూసినా.. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే మరణాలే ఎక్కువగా చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అమెరికా నిపుణులు చెప్పారు. డెల్టా వేరియంట్ ప్రబలుతున్న కాలంలో అమెరికాలో గరిష్టంగా మరణాలు 2,100 చోటుచేసుకున్నాయి. తాజాగా, గత గురువారం మరణాలు 2,267 మరణాలు అమెరికాలో చోటుచేసుకున్నాయి.

అమెరికా దేశంలో ఇప్పటి వరకు మరణాలు 8.78 లక్షల మరణాలు చోటుచేసుకున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఈ సంఖ్య పది లక్షలను దాటేలా ఉన్నదని యూనివర్సిటీ కాలిఫోర్నియా హెల్త్ ప్రొఫెసర్ ఆండ్రూ నొయమర్ వివరించారు. ప్రస్తుతం దేశంలో నమోదయ్యే ప్రతి కేసు దాదాపు ఒమిక్రాన్ కారణంగానే అవతున్నాయని ఇంకొందరు నిపుణులు చెప్పారు. ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వలన కేసులూ భారీగానే నమోదు అవుతున్నాయని, చివరగా ఆరోగ్య వ్యవస్థపైనా తీవ్ర ఒత్తిడి పడుతున్నదని వివరించారు. ఒమిక్రాన్‌తో స్వల్ప లక్షణాలే నమోదు అవుతున్నాయని అనుకోరాదని, ఇక్కడ స్వల్ప లక్షణాలుగా కనిపించినా కొందరిని కబళిస్తున్నదని డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రొచెల్లి వాలెన్స్కీ తెలిపారు. ఎందుకంటే డెలవేర్‌లోని 49 ఏళ్ల ఓ వ్యక్తి క్రిస్మస్‌కు కొన్ని రోజుల ముందు ఒమిక్రాన్ బారిన పడ్డాడని, స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ వారంలోగానే మరణించాడని వివరించారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !