ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు తీవ్ర అనారోగ్యం.. సోదరి ఏం చెప్పిందంటే?

By Mahesh KFirst Published Aug 11, 2022, 1:58 PM IST
Highlights

తొలిసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆరోగ్య వివరాలు బయటకు వచ్చాయి. కిమ్ జోంగ్ ఉన్ భారీ మొత్తంలో ప్రజలు ‘జబ్బు’తో బాధపడుతున్నప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని ఆయన సోదరి వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దూకుడు వ్యాఖ్యలతో ఫేమస్. అందరికీ ఆసక్తికరంగా ఉండే ఉత్తర కొరియాకు వంశపారంపర్యంగా వచ్చిన అధికార పీఠాన్ని అధిరోహించారు. అక్కడ చాలా వింత నిబంధనలు అమలవుతూ ఉంటాయి. వేసుకునే బట్టల నుంచి కత్తిరించుకునే జుట్టు వరకు తప్పకుండా రూల్స్ పాటించాల్సిందే. అలాంటి ఓ వింత రూలే.. ఆ దేశ అధ్యక్షుడి ఆరోగ్య వివరాలు గోప్యంగా ఉంచడం. ఆ దేశ అధ్యక్షుడు మీడియాకు లేదా బహిరంగంగా కనిపించకుండా కొన్ని రోజులు, వారాలు, నెలలు గడిచినా ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడొద్దనేది అక్కడి ప్రజలు, అధికారులు పాటించే నియమం. కానీ, తాజాగా కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సంచలన విషయాలు వెల్లడించారు.

ఉత్తర కొరియాలో వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వందల వేల మంది అనారోగ్యంతో మంచం పట్టారు. కానీ, ఆ వైరస్‌ను ఉత్తర కొరియా కరోనా వైరస్‌గా గుర్తించలేదు. పిలవడమూ లేదు. ఈ వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా మంచం పట్టారని సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడని తెలిపారు. కానీ, అంతటి అనారోగ్యంలోనూ ఆయన తన పనిని మానుకోలేదని వివరించారు. ప్రజల సంక్షేమానికి పాటుపడటానికే ప్రతి క్షణం కేటాయించారని పేర్కొన్నారు.

ఓవర్ వెయిట్, స్మోకింగ్ అలవాటు ఉన్న కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై తరుచూ వదంతలు వ్యాపిస్తుంటాయి. ప్యాంగ్యాంగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆయన బహిరంగంగా కనిపిస్తుంటారు. ఆయన కుటుంబ సభ్యులకు హృద్రోగ సమస్యలు ఉండటం  కారణంగా కిమ్ జోంగ్ ఉన్ బయట కనిపించకుంటే రకరకాల వదంతులు ప్రచారంలోకి వస్తుంటాయి. 

కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్.. సోదరుడి అనారోగ్యం గురించి వెల్లడిస్తూ దక్షిణ కొరియాపైనా విమర్శలు చేశారు. దక్షిణ కొరియా నుంచి కొన్ని మకిలి పదార్థాలు బెలూన్లకు వేలాడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో కరపత్రాలు వస్తున్నట్టు పేర్కొన్నారు. కరపత్రాలు ఒకరి నుంచి మరకొరికి మారుతుండటం మూలంగా ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొన్నారు.

click me!