Russia Ukraine Crisis: తొలిసారి స్పందించిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికాలపై కామెంట్లు

Published : Feb 27, 2022, 01:20 PM IST
Russia Ukraine Crisis: తొలిసారి స్పందించిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికాలపై కామెంట్లు

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై తొలిసారి ఉత్తర కొరియా స్పందించింది. ఈ సంక్షోభానికి మూలకారణం అమెరికానే అని ఆరోపించింది. ఈ సంక్షోభంలో ఉత్తర కొరియా దేశం రష్యాకు అండగా నిలిచింది. అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే దురాశలోనే ఈ సంక్షోభం మూలకారణాలు ఉన్నాయని పేర్కొంది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్‌పై తమ సైనిక చర్య(Miiltary Operation) కొనసాగుతుందని రష్యా నిన్న ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను అమెరికా(America), యూరప్ కంట్రీస్ సహా చాలా దేశాలు ఖండించాయి. మరికొన్ని దేశాలు ఆర్థిక ఆంక్షలు కూడా విధించాయి. ఈ వివాదంపై ప్రధాన ఆర్థిక వ్యవస్థలతోపాటు తాలిబాన్ దేశం కూడా రియాక్ట్ అయింది. తాజాగా, ఉత్తర కొరియా(North Korea) దేశం తనదైన శైలిలో స్పందించింది. అమెరికాపై విరుచుకుపడింది.

ఉక్రెయిన్ సంక్షోభానికి మూల కారణం అమెరికానే అని ఉత్తర కొరియా ఆరోపించింది. ఉత్తర కొరియా విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ నార్త్ సొసైటీకి చెందిన పరిశోధకుడు రీ జీ సాంగ్ వ్యాఖ్యాన్ని పోస్టు చేసింది. రష్యా తన భద్రత కోసం లేవనెత్తిన డిమాండ్‌ను అమెరికా లక్ష్య పెట్టలేదని వివరించింది. అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్నే అనుసరించిందని పేర్కొంది. అమెరికా హద్దుమీరిన తనం.. విచ్చలవిడితనమే ఉక్రెయిన్ సంక్షోభ మూలకారణాల్లో ప్రధానమైనదని తెలిపింది. అమెరికా ద్వంద్వ స్వభావాన్ని అనుసరిస్తున్నదని ఆరోపించింది.

శాంతి, భద్రతల పేరిట అమెరికా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుందని తెలిపింది. అదే సమయంలో ఇతర దేశాలు వాటి స్వీయ రక్షణ కోసం తీసుకునే చర్యలనూ సరైన కారణం లేకుండానే ఖండిస్తుందని ఆరోపించింది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నించిన రోజులు అమెరికాకు చెల్లిపోయాయని తెలిపింది.

ఎవా విమెన్ యూనివర్సిటీలో నార్త్ కొరియా స్టడీస్ బోధిస్తున్న ప్రొఫెసర్ పార్క్ వొన్ గొన్ కూడా ఈ సంక్షోభంపై స్పందించారు. ఈ సంక్షోభం మూలాలు చూసుకుంటే... అక్కడ మనకు అమెరికానే కనిపిస్తుందని వివరించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీకు పవర్ లేకుంటే మీరు పీడించబడతారు అని పేర్కొన్నారు.

ఉత్తర కొరియాకు ఉన్న అతి తక్కువ అంతర్జాతీయ మిత్రుల్లో చైనాతోపాటు రష్యా కూడా ఉంటుంది. అణ్వాయుధాల కారణంగా నార్త్ కొరియాపై అంతర్జాతీయ ఆంక్షలు చాలా కాలంగా అమలు అవుతున్నాయి. ఈ ఆంక్షలను ఎత్తేయాలని, ఉత్తర కొరియాకు ఊరట ఇవ్వాలని రష్యా గతంలో ప్రపంచ దేశాలను కోరిన సంగతి తెలిసిందే.

కాగా, నార్త్ కొరియాకు దగ్గరి స్నేహితులైన చైనా దేశం కూడా రష్యాకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికా, దాని మిత్ర దేశాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని చైనా ఇది వరకే ఈ సంక్షోభంపై కామెంట్ చేసింది.

దక్షిణ కొరియా వైఖరి మాత్రం ఉత్తర కొరియాకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుందని తెలిసిందే. దక్షిణ కొరియా అమెరికా వైపు నిలిచింది. ఉక్రెయిన్‌పై దాడుల విషయమై రష్యాపై ఇతర దేశాలతో కలిసి ఆంక్షలు విధించడానికి సిద్ధం అని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే