నోబెల్ ప్రైజ్ 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

By Sumanth KanukulaFirst Published Oct 4, 2022, 5:34 PM IST
Highlights

రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ నేడు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. 


రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ నేడు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. ఫోటాన్ల పరిశోధన, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో చేసిన ప్రయోగాలకు గాను శాస్త్రవేత్తలు అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, అంటోన్ జైలింగర్‌లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2022ను ప్రధానం చేయనున్నట్టుగా రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ప్రకటన విడుదల చేసింది. ‘‘క్వాంటం సమాచారం ఆధారంగా ఫలితాలు కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి’’ అని పేర్కొంది. 

ఇక, అలైన్ ఆస్పెక్ట్.. ఫ్రాన్స్‌లోని అజెన్‌లో 1947లో జన్మించారు. ఆస్పెక్ట్ ఫ్రాన్స్‌లోని ఓర్సేలోని పారిస్-సుడ్ విశ్వవిద్యాలయం నుంచి పీహె‌డీ పూర్తి చేశారు. జాన్ ఎఫ్ క్లాజర్.. 1942లో కాలిఫోర్నియాలోని పసాదేనాలో జన్మించారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి PhD పొందారు. అతను జెఎఫ్ క్లాజర్ అండ్ అసోసియేట్స్‌లో పరిశోధనా భౌతిక శాస్త్రవేత్తగా ఉన్నారు. అంటోన్ జైలింగర్.. ఆస్ట్రియాలోని రైడ్ ఇమ్ ఇన్‌క్రెయిస్‌లో 1945లో జన్మించారు. జైలింగర్ ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. అదే సంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

 

BREAKING NEWS:
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 in Physics to Alain Aspect, John F. Clauser and Anton Zeilinger. pic.twitter.com/RI4CJv6JhZ

— The Nobel Prize (@NobelPrize)

ఈ ఏడాది నోబెల్ పురస్కారాల విషయానికి వస్తే.. సోమవారం వైద్య శాస్త్రంలో అవార్డు ప్రకటించగా.. నేడు భౌతిక శాస్త్రంలో పురస్కారాన్ని ప్రకటించారు. బుధవారం రసాయ, గురువారం సాహిత్య రంగం, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ విజేతలను వెల్లడించనున్నారు. 1895 నాటి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం.. నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు. 1901 నుంచి సైన్స్, సాహిత్యం, శాంతికి సంబంధించి అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఇక, 1968 నుంచి ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇస్తున్నారు.
 

click me!