క్యాథలిక్ ల మత గురువు- పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పోప్ ఎవరు? ఎలా ఎన్నుకుంటారు? ఎప్పుడు ఎన్నుకుంటారు? అసలు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో నెక్స్ట్ పోప్ ఎవరనే చర్చా అంతటా జరుగుతోంది. పోప్ ను ఎప్పుడు, ఎలా ఎన్నుకుంటారు? అసలు ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుంది? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పోప్ ఫ్రాన్సిస్ చాలా మంది సీనియర్ క్యాథలిక్ మత గురువులను కార్డినల్స్‌గా నియమించారు. వీళ్లే నెక్స్ట్ పోప్‌ను ఎన్నుకుంటారు. పోప్ కావాలంటే బాప్టిజం పొందిన రోమన్ క్యాథలిక్ పురుషుడై ఉండాలి. అయితే చాలా శతాబ్దాలుగా కార్డినల్స్ తమలో ఒకరినే పోప్‌గా ఎన్నుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ మంది కార్డినల్స్ ఉన్నారు. వారు సాధారణంగా జీవితాంతం ఈ పదవిలో ఉంటారు.
80 ఏళ్లలోపు కార్డినల్స్ 'పోప్ కాన్క్లేవ్' అనే సమావేశంలో ఓటు వేస్తారు. బయటి ప్రభావం లేకుండా, కాన్క్లేవ్ జరిగే సిస్టీన్ చాపెల్‌ను మూసివేసి.. నెక్స్ట్ పోప్ గురించి చర్చిస్తారు. సాధారణంగా ఓటర్ల సంఖ్య 120గా పరిమితం చేసినప్పటికీ, ప్రస్తుతం 138 మంది అర్హత కలిగిన ఓటర్లు ఉన్నారు.
కార్డినల్స్ రహస్య బ్యాలెట్ ద్వారా ఓట్లు వేస్తారు. దీన్ని 9 మంది యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన కార్డినల్స్ పర్యవేక్షిస్తారు. కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి సాధారణంగా మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఈ లక్ష్యం చేరుకునే వరకు ఓటింగ్ కొనసాగుతుంది.
ఒక కార్డినల్.. పోప్‌గా ఎన్నిక కావాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ పొందాలి. 80 ఏళ్లలోపు కార్డినల్స్ వాటికన్ సిటీలోని సిస్టీన్ చాపెల్‌లో సమావేశమవుతారు. అక్కడ వారు ప్రమాణం చేసి రహస్యంగా ఓటు వేస్తారు.
ప్రతి ఓటింగ్ తర్వాత బ్యాలెట్ పేపర్లను కెమికల్స్ తో కాల్చడం ఆనవాయితీ. ఇది నలుపు లేదా తెలుపు పొగను ఉత్పత్తి చేస్తుంది. ఈ పొగ ప్రపంచానికి పోప్ ఎన్నిక ఫలితాన్ని సూచిస్తుంది. నల్ల పొగ వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తెల్ల పొగ వస్తే కొత్త పోప్ ఎన్నికయ్యాడని అర్థం. పోప్ ఎన్నికైన తర్వాత.. ఒక సీనియర్ కార్డినల్ సెయింట్ పీటర్స్ బాసిలికా నుంచి ఆయన పేరును ప్రకటిస్తారు.
ఒక కార్డినల్ తగినన్ని ఓట్లు పొందిన తర్వాత మిగిలిన కార్డినల్స్ ఆమోదిస్తారా అని అడుగుతారు. వారిలో ఎక్కువ మంది ఆమోదిస్తే కొత్త పోప్‌గా ప్రకటిస్తారు. కొత్త పోప్ "హబెమస్ పాపం!" (మనకు ఒక పోప్ ఉన్నారు) అనే మాటలతో ప్రపంచానికి ప్రకటిస్తారు. కొత్త పోప్ సెయింట్ పీటర్స్ బాసిలికా బాల్కనీ నుంచి తన మొదటి ఆశీర్వాదం ఇస్తారు.
సాధారణంగా పోప్ మరణం లేదా రాజీనామా తర్వాత 2 లేదా 3 వారాల తర్వాత జరుగుతుంది. ఇది 9 రోజుల సంతాప కాలాన్ని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్స్ వాటికన్ కు చేరుకోవడానికి అనుమతిస్తుంది. దక్షిణ అమెరికా నుంచి మొదటి పోప్ అయిన పోప్ ఫ్రాన్సిస్‌ను ఎన్నుకున్న 2013 కాన్క్లేవ్, బెనెడిక్ట్ XVI రాజీనామా చేసిన 12 రోజుల తర్వాత ప్రారంభమైంది.
ఈ ప్రక్రియ కొన్ని రోజులు, వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు. మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించడానికి ప్రతిరోజూ కాన్క్లేవ్‌లో నాలుగు రౌండ్ల వరకు ఓటింగ్ జరగవచ్చు. 33 రౌండ్ల తర్వాత కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మొదటి ఇద్దరు అభ్యర్థులు రెండవ బ్యాలెట్‌లో పోటీపడతారు.
గత ముగ్గురు పోప్‌ల ఎన్నికలు చాలా త్వరగా జరిగాయి. కానీ పోప్ ఎన్నికలు కొన్నిసార్లు చాలా కాలం పాటు సాగాయి. తీవ్రమైన రాజకీయ పోరాటాల కారణంగా 1271లో పోప్ గ్రెగొరీ X ఎన్నిక దాదాపు 3 సంవత్సరాలు పట్టింది.
కాన్క్లేవ్‌లో ఓటు వేయడానికి అర్హత కలిగిన 138 మంది కార్డినల్స్‌లో 110 మందిని.. పోప్ ఫ్రాన్సిస్ నియమించారు. ఈ బృందం మునుపటి కార్డినల్స్ కంటే చాలా భిన్నమైంది. ఇందులో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి ఎక్కువ మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి శతాబ్దాల తర్వాత మొదటిసారిగా నెక్స్ట్ పోప్ ఆఫ్రికా, ఆసియా నుంచి లేదా ఇతర ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉంది.
ఆఫ్రికన్ కార్డినల్స్ అయిన ఘనాకు చెందిన పీటర్ టర్క్సన్, కాంగోకు చెందిన ఫ్రైడోలిన్ అంబోంగో కొత్త పోప్ రేసులో ముందున్నారు. ఫిలిప్పీన్స్ కార్డినల్ లూయిస్ టాగ్లే, హంగేరి కార్డినల్ పీటర్ ఎర్డో, కార్డినల్ పియట్రో పరోలిన్, ఇటలీకి చెందిన మాటియో జుప్పి, మాల్టాకు చెందిన మారియో గ్రెచ్ కూడా పోప్ రేసులో ఉన్నారు.
'కమర్లెంగో' అనే సీనియర్ కార్డినల్ పోప్ మరణాన్ని ధృవీకరించి.. వాటికన్ ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలను తాత్కాలికంగా చూసుకుంటారు. అయితే చర్చి సిద్ధాంతాలను మార్చడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకు అధికారం లేదు.