
New York Fire Accident: అమెరికా న్యూయార్క్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే.. న్యూయార్క్ నగరంలోని ది బ్రోంక్స్ బరోలో అపార్ట్‌మెంట్ భవనం లో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. తీవ్రంగా గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా 19 మంది సజీవ దహనమయ్యారు. దాదాపు 32 మంది పరిస్థితి విషయంగా మారింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది కొలుకోని విషాదమని మిస్టర్ ఆడమ్స్ ట్విట్టర్‌లో రాశారు.
ఈ ఘటనపై నగర అగ్నిమాపక శాఖ కమిషనర్ డేనియల్ నిగ్రో మాట్లాడుతూ.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడిపోవడంతో భవనం అంతటా పొగ వ్యాపించిందని, దీంతో భవనంలో ఉన్నవారు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడి.. సృహ కోల్పోయారని. అందుకే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిందని అన్నారు. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంలో సహాయపడ్డారని, ప్రజలను రక్షించేందుకు స్థానికులు కూడా ముందుకు వచ్చారని మిస్టర్ ఆడమ్స్ తెలిపారు.
గత వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రమాదం రెండోసారి అని.. గత బుధవారం తెల్లవారుజామున ఫిలడెల్ఫియాలోని పబ్లిక్ హౌసింగ్ అపార్ట్‌మెంట్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటలు వ్యాపించడంతో ఎనిమిది మంది పిల్లలతో సహా 12 మంది వ్యక్తులు సజీవ దహనమైనట్టు తెలిపారు. ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండవ పెద్ద ఘోరమైన అగ్నిప్రమాదం ఇదేనని తెలిపారు.