రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ: వైరస్ కట్టడిలో విఫలం.. పతంజలి ‘‘కరోనిల్‌’’పై నేపాల్ నిషేధం

By Siva KodatiFirst Published Jun 9, 2021, 7:59 PM IST
Highlights

ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా సంస్థ పతంజలి కరోనా కోసం తీసుకొచ్చిన కరోనిల్ కిట్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. భూటాన్ ఇప్పటికే ఈ మందుపై నిషేధం విధించగా తాజాగా, నేపాల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది

ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా సంస్థ పతంజలి కరోనా కోసం తీసుకొచ్చిన కరోనిల్ కిట్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. భూటాన్ ఇప్పటికే ఈ మందుపై నిషేధం విధించగా తాజాగా, నేపాల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. కరోనా వైరస్‌ను నివారించడంలో కరోనిల్ విఫలమైందని ఆదేశాల్లో తెలిపింది. దీనితో పాటు రామ్‌దేవ్ బాబా బహుమతిగా పంపిన 1,500 కిట్లను వాడకూడదని నేపాల్ నిర్ణయించింది. కరోనా కిట్‌లోని ట్యాబ్లెట్లు, నూనె కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో విఫలమయ్యాయని నేపాల్ ఆయుర్వేద మంత్రిత్వశాఖ తెలిపింది. అందుకే కరోనిల్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read:మనుషులపై సక్సెస్... మందు మాత్రం కాదు: ‘ కరోనిల్‌ ’‌పై పతంజలి యూటర్న్

కాగా, కరోనిల్‌ను కోవిడ్ పేషెంట్లకు పంపిణీ చేయాలని కొద్దిరోజుల క్రితం హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బారిన పడిన వారికి ఉచితంగా ఈ కరోనిల్ కిట్ ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని హర్యానా మంత్రి అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. హర్యానాలోని కోవిడ్ పేషెంట్లకు ఒక లక్ష పతంజలి కరోనిల్ కిట్లను పంపిణీ చేస్తామని అనిల్ విజ్ పేర్కొన్నారు. ఈ కిట్లకు అయ్యే ఖర్చును పతంజలి సగం భరిస్తుందని... మిగిలిన సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు.

మరోవైపు, కరోనిల్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ ఔషధాన్ని అశాస్త్రీయంగా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమ మెడిసిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికెట్ కూడా ఉందని రాందేవ్ వాదించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పతంజలి మెడిసిన్ కు హర్యానా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
 

click me!