
ఇప్పటికే ఆలస్యమైన NEET PG Counseling ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా.. ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాకు (EWS quota) సంబంధించి దాఖలైన కేసులను అత్యవసరమైనవిగా భావించి విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ( Supreme Court) కోరిన సంగతి తెలిసిందే. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బొపన్నల ధర్మాసనం ఎదుట సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ కేంద్ర తరఫున ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనిన సీజేఐ దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. మంగళవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చేలా విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు బుధవారం (జనవరి 5) అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
ఇక, వాస్తవానికి ఈ వ్యాజ్యాలపై జనవరి 6వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. అయితే నీట్ పీజీ కౌన్సెలింగ్ ఆలస్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల రెసిడెంట్ డాక్టర్లు నిరసనల చేపడుతున్నారు. ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు నిర్వహించిన నిరసనలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును అత్యవరసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కేంద్రం కోరింది.
కేంద్రం చేసిన ఈ అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ (NV Ramana), న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ‘ఇది ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ అంశం అయితే.. అది రేపు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందు జాబితా చేయబడుతుంది’ అని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు.
ఇక, NEET PG ఎగ్జామ్ 2021 ముందుగా మే 2021లో షెడ్యూల్ చేయబడింది. అయితే దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సెప్టెంబరుకు వాయిదా పడింది. పరీక్ష నిర్వహించి.. అక్టోబర్ 25 నుంచి నీట్ పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని తొలుత ప్రకటించారు. అయితే నీట్ పీజీ-2021 ప్రవేశాల్లో.. ఆలిండియా కోటా (AIQ) కేటగిరీలో ఓబీసీలకు 27 శాతం కోటా, ఈడబ్ల్యూఎస్‌కి 10 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ కేంద్రం జూలై 29న నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నీట్-పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కోటాను సవాల్ చేస్తూ పలువురు నీట్ అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.
ఆ పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. నీట్ పీజీ-2021 ప్రవేశాల్లో (NEET admission) రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు కన్నా తక్కువగా ఉన్నవారికి ఆర్థికంగా వెనకబడిన తరగతుల (Economically Weaker Section- EWS) వారిగా పరిగణించడంపై పునః సమీక్షిస్తామని గతేడాది నవంబర్‌లో కేంద్రం కోర్టుకు తెలిపింది. ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకునే వరకు నీట్ కౌన్సెలింగ్‌ను మరో నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు.. 2022 జనవరి 6కు వాయిదా వేసింది.