
Ukraine Russia Crisis: గతవారం రోజులుగా.. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశంలోని పలు నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్ సహా చాలా నగరాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం విరమించాలని.. అమాయకుల ప్రాణాలు పోతున్నాయని..ప్రపంచ దేశాలు మొత్తకుంటున్న రష్యా మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ పౌరులు ప్రాణాలు చేతితో పెట్టుకుని బతుకుతున్నారు.
ఈ తరుణంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు స్వదేశానికి తిరిగి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఉక్రెయిన్ వదిలిపెట్టి రావాలంటూ భారత ప్రభుత్వం చేసిన సూచన మేరకు ఇప్పటి వరకు 17,000 మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దును దాటినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
సరిహద్దు దాటిన భారతీయులను వివిధ దేశాల నుంచి స్వదేశానికి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో భారతీయుల పరిస్థితిపై కొన్ని వివరాలు తెలియజేశారు. MEA అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ఆపరేషన్ గంగా ( Op Ganga ) కార్యక్రమంలో భాగంగా బుకారెస్ట్ నుండి బుధవారం రాత్రికి ఢిల్లీకి వస్తుందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో 15 విమానాలు షెడ్యూల్ చేశామని ప్రకటించారు. సరిహద్దులకు సమీపంలోని పట్టణాల్లో ఆశ్రయం, ఆహారం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అరిందమ్ బాగ్చి తెలిపారు.
ఉక్రెయిన్ సరిహద్దులు దాటిన భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాననీ. కేంద్రం సలహాలు జారీ చేయబడినప్పటి నుండి ఇప్పటివరకూ దాదాపు 17,000 మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దును విడిచిపెట్టారని తెలిపారు. ఇందులో ముందుగా రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోని కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ గంగా కింద విమానాలు కూడా బాగా పెరిగాయనీ.. గత 24 గంటల్లో, ఆరు విమానాలు భారతదేశంలో ల్యాండ్ అయ్యాయనీ, దీనితో భారతదేశంలో ల్యాండ్ అయిన మొత్తం విమానాల సంఖ్య 15కి చేరుకుందనీ. ఉక్రెయిన్ నుంచి భారత్ కు వచ్చిన వారి సంఖ్య 3,352కి చేరిందని తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దును ఫిబ్రవరి 24న మూసివేయడం వల్ల సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి, పొలాండ్ దేశాల నుంచి ఇండియాకు తరలిస్తున్నారని తెలిపారు.
ఆపరేషన్ గంగగా పిలుస్తున్న ఇందులో భారత వైమానిక దళం (భారత ఎయిర్ ఫోర్స్) విమానాలు కూడా చేరాయి. ఇప్పటికే సీ-17 అనే విమానాన్ని బుచారెస్ట్ (రొమేనియా) నుంచి ప్రారంభించారు. మరో మూడు విమానాల్ని బుడాపెస్ట్(హంగేరి), బుచారెస్ట్(రొమేనియా), రెసో(పొలండ్)ల నుంచి నడపనున్నట్లు ప్రకటించారు.
సరిహద్దులకు సమీపంలోని పట్టణాల్లో ఆశ్రయం, ఆహారం కోసం ఏర్పాట్లు చేయడానికి భారతదేశం కూడా ప్రయత్నిస్తోందని బాగ్చీ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, ఎల్వివ్ కార్యాలయానికి భారత అధికారులు వచ్చిన తర్వాత, తరలింపు ప్రక్రియను పటిష్టం చేస్తామని, సరిహద్దులు దాటుతున్న ప్రజలకు భారత రాయబార కార్యాలయం సహాయం చేయగలదని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, నిరంతరం కొనసాగుతున్న దాడుల వల్ల తూర్పు ఉక్రెయిన్‌లోని నగరాలు నివసిస్తున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.