
న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశాల్లో కుటుంబాలు ఎక్కువగా పుత్రుడినే కనాలని భావిస్తుంటాయి. కూతురి కంటే.. కొడుకే కుటుంబానికి ఆర్థికంగా దన్నుగా నిలబడతాడని, కొన్ని కుటుంబాలు వంశాన్ని పెంచుకోవాలనే ఆలోచనలతో ఈ అభిప్రాయాలను బలంగా కలిగి ఉంటారు. ఎంత మంది బాలికలు పుట్టినా.. అబ్బాయి పుట్టే వరకు ఆగని వారూ ఉంటారు. ఒక్కోసారి అబ్బాయినే కనాలని లేనిపోని అల్టిమేటంలు ఇంటావిడకు జారీ చేస్తుంటారు. వెనుకబాటు మూలంగా శాస్త్ర విజ్ఞానం కొరవడి అబ్బాయినే ప్రసవించాలని ఎన్నో అనవసరమైన ప్రయాసాలకు పోతుంటారు. మంత్రాలు, తంత్రాలు అంటూ మూఢనమ్మకాలను నమ్ముతారు. ఈ కోవలోనే పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. తలలోకి మేకును దింపితే ఆ గర్భిణి(Pregnant) తప్పకుండా అబ్బాయినే(Baby Boy) కంటుందని ఓ మంత్రగాడు(Faith Healer) నమ్మించాడు. అదే పని అమలు చేశాడు కూడా.
పేషావార్ నగరానికి చెందిన ఓ మహిళ ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి కూడా అమ్మాయి పుట్టేలా ఉన్నదని ఆమె భర్త, కుటుంబీకులు భయపడ్డారు. ఎలాగైనా ఈ సారి అబ్బాయినే జన్మించేలా ఏదైనా చేయాలని వారు అనుకున్నారు. ఓ మంత్రగాడిని ఇంటికి రప్పించారు. ఎలాగైనా ఈ సారి తన భార్య అబ్బాయినే కనేలా ఏదైనా చేయాలని వేడుకున్నారు. ఆ మంత్రగాడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ గర్భిణి తలలోకి సుత్తెతో మేకు దిగబెడితే.. ఆమె తప్పకుండా సుపుత్రుడినే కంటుందని నమ్మబలికాడు.
ఆ మంత్రగాడు చెప్పిన మాటలను వారంతా విశ్వసించారు. అందరూ అందుకు సమ్మతించారు. దీంతో ఆ మంత్రగాడు.. సుత్తె లేదా ఇతర బరువైన వస్తువుతో మేకును ఆ గర్భిణి నొసటి పై నుంచి పుర్రెలోకి దింపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితే, ఆ గర్భిణి మేకు దింపిన తర్వాత కూడా స్పృహలోనే ఉండింది. కానీ, భరించలేని నొప్పితో విలవిల్లాడింది. ఆ మేకును తల నుంచి తొలగించాలని చివరకు ఆమె భర్త, ఆమె భావించారు. కానీ ఆ మేకు అంత సులువుగా వచ్చేలా లేదు. చేతితో ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు. దీంతో ప్లయర్ వంటి పరికరాలతోనూ ప్రయత్నాలు చేశారు. కానీ, అందులో వారు సఫలం కాలేదు. దీంతో ఆమె ఓ హాస్పిటల్‌కు వెళ్లారు.
ఆ హాస్పిటల్‌లో ఎక్స్‌రే తీయగా.. రెండు ఇంచుల మేకు ఆమె నొసలు పై భాగంలో లోపలికి వెళ్లి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కానీ, ఆ మేకు అదృష్టవశాత్తు ఆమె మెదడును తాకలేదు. వైద్యులు దీని గురించి వాకబు చేయగా.. ఆమె ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. తొలుత తానే ఆ మేకు తన తలలోకి దించుకున్నట్టు చెప్పుకున్నది. ఆ తర్వాత ఓ మంత్రగాడు దింపినట్టు పేర్కొన్నది. ఈ విషయం పోలీసులకూ తెలిసింది.
ఆ గర్భిణి వివరాలను కొనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ త్వరలోనే పట్టుకుని తీరుతామని పేర్కొన్నారు. ఆమెను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. ఆమె అందించే సమాచారంతో ఆ మంత్రగాడిని అదుపులోకి తీసుకుంటామని వివరించారు.