ముంబై పేలుళ్ల నిందితులకు పాక్‌లో సకల సౌకర్యాలు.. 5 స్టార్ ఆతిథ్యం.. యూఎన్ వేదికగా భారత్ ఫైర్..

By Sumanth KanukulaFirst Published Jan 19, 2022, 11:34 AM IST
Highlights

దాయాది పాకిస్తాన్ (Pakistan) తీరును భారత్ అంతర్జాతీయ వేదికపై ఎండగట్టింది. 1993 ముంబై పేలుళ్లకు (Mumbai Blasts) కారణమైన సూత్రధారులకు పాక్ ఆశ్రయం ఇవ్వడడమే.. విలాసవంతమైన వసతులు కల్పిస్తుందని ఐకరాజ్య సమితి వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దాయాది పాకిస్తాన్ (Pakistan) తీరును భారత్ అంతర్జాతీయ వేదికపై ఎండగట్టింది. 1993 ముంబై పేలుళ్లకు (Mumbai Blasts) కారణమైన సూత్రధారులకు పాక్ ఆశ్రయం ఇవ్వడడమే.. విలాసవంతమైన వసతులు కల్పిస్తుందని ఐకరాజ్య సమితి వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్ నిర్వహించిన అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కాన్ఫరెన్స్ 2022లో యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి (TS Tirumurti) మాట్లాడుతూ.. టెర్రరిజం మూలాలను ప్రపంచం గుర్తించాల్సి ఉందన్నారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల మధ్య సంబంధాలను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  

1993 ముంబై బాంబు పేలుళ్లకు కారణమైన ముఠాకు పాకిస్తాన్ రక్షణ కల్పించడమే కాకుండా, ఫైవ్ స్టార్ ఆతిథ్యం ఇవ్వడం చూస్తున్నామని మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను, ఆయన D-కంపెనీని లక్ష్యంగా చేసుకుని తిరుమూర్తి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాలు చేరకుండా చూడటంతో పాటుగా, వారి ప్రయాణాలను నిరోధించాలని ఆయన కోరారు. అయితే ఈ చర్యల అమలు సవాలుతో కూడినదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కౌన్సిల్ ఏర్పాటు చేసిన అన్ని ఆంక్షల విధానాలు, వాటి పని విధానాలు, నిర్ణయం తీసుకోవడంలో తగిన ప్రక్రియను నిర్ధారించడం చాలా కీలకం. నిర్ణయం తీసుకునే ప్రక్రియ, జాబితాలో చేర్చడం/జాబితా తొలగింపు చర్యలు వేగవంతమైన, విశ్వసనీయమైన, సాక్ష్యం ఆధారంగా పారదర్శకంగా ఉండాలి’ అని తిరుమూర్తి వ్యాఖ్యానించారు.

2020 ఆగస్ట్‌లో.. 88 నిషేధిత ఉగ్రవాద గ్రూపులు, వాటి నాయకులపై ప్రభుత్వం విస్తృతమైన ఆంక్షలు విధించిన తర్వాత.. దావూద్‌ ఇబ్రహీం తమ గడ్డ మీదే ఉన్నాడనే పాకిస్తన్ అంగీకరించింది. పాక్ విడుదల చేసిన జాబితాలో దావూద్ పేరు కూడా ఉంది. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత.. దావూద్ ఇబ్రహీం భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే.
 

click me!