
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం విరమించుకోవాలని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పలుమార్లు రష్యాకు విజ్ఞప్తి చేసింది. ఐరాస కౌన్సిల్ శాశ్వత సభ్య దేశాలు సైతం రష్యా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. యూరప్ దేశాలు సైతం ఉక్రెయిన్ మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే, ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ చర్య కారణంగా ఇప్పటికే ఆ దేశ రూపురేఖలు మారి పోయాయి. అనేక ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రణాలు కోల్పోయారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సైనికుడు పంచుకున్న ఓ వీడియో వైరల్ గా మారింది. అందరినీ కలచివేస్తున్నది.
ఉక్రెయిన్ సైనికుడు పంచుకున్న ఆ షార్ట్ వీడియోలో తన తల్లిదండ్రులను, ఆ దేశాన్ని గురించి ప్రస్తావించాడు. "అమ్మా, నాన్న, నేను మిమ్నిల్ని ప్రేమిస్తున్నాను" అని అందులో పేర్కొన్నాడు. రష్యా.. ఉక్రెయిన్ పై మిలిటరీ చర్య కొనసాగిస్తూ.. బాంబుల వర్షం కురిపిస్తున్న క్రమంలో ఈ వీడియో వచ్చింది. ఆ సైనికుడు యుద్ధంలో పాలుపంచుకుని ఉన్న క్రమంలో.. ఈ వీడియో తీసినట్టుగా అందులోని దృశ్యాలను చూస్తే అర్థమవుతోంది.
ఇదిలావుండగా, రష్యా.. ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలా వరకు సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. సామాన్య ప్రజానీకంపై దాడి చేయడం లేదని పేర్కొంది. అయితే, రష్యా తీరుపై ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే తన చర్యలను ఆపాలని పిలుపునిస్తున్నాయి. నాటో తీవ్రంగానే స్పందించింది. తగిన చర్యలు తీసుకుంటామని నాటో దేశాలు రష్యాను హెచ్చరించాయి. ఇప్పటికే అమెరికా తమ బలగాలను మరింతగా మోహరించడానికి సిద్ధమవుతున్నదని సమాచారం. ఇక ఆర్థికంగా ఇప్పటికే ఆంక్షలు విధించిన అమెరికా... మరిన్ని ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. శుక్రవారం నాడు జపాన్ సైతం ఆంక్షలు విధిస్తూ.. తన నిర్ణయం ప్రకటించింది. అయితే, ఇవేవి లెక్కచేయకుండా.. ముందుకు సాగుతూ.. ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్.
రష్యా అధ్యక్షుడు పుతిన్.. సైనిక ఆపరేషన్ ప్రకటించిన వెంటనే.. రష్యా-బెలారస్ ల నుంచి ఉక్రెయిన్ పై దాడి మొదలైంది. బెలారస్తో ఉత్తర సరిహద్దు నుండి ట్యాంకులను పంపి, రష్యా దాడులను ప్రారంభించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా తూర్పు, దక్షిణాన ఇలా అన్ని ప్రాంతాలను నుంచి రష్యా దాడిని కొనసాగిస్తున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురుస్తోంది. ఈ దాడిలో వందలాది మంది ఉక్రేనియన్లు మరణించారని డైలీ మెయిల్ నివేదించింది. ఈ రష్యా మిలిటరీ ఆపరేషన్ తో ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్.. రష్యన్ జెట్‌లు, ఒక హెలికాప్టర్‌ను దేశ తూర్పు ప్రాంతంలో ఖార్కివ్ సమీపంలో కాల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది.