
న్యూఢిల్లీ: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ, కొన్నిసార్లు మొసళ్లు ఉండే కొలనుల్లోనూ డిసైడ్ అవుతాయని మెక్సికన్ మేయర్‌ను చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే.. మెక్సికోలోని ఓ మేయర్ ఏకంగా మొసలిని పెళ్లి చేసుకున్నాడు. అలా.. ఇలా కాదు.. విందు భోజనాలతో, బ్యాండ్ మేళం, డ్యాన్సులతో వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మొసలి, మేయర్ పెళ్లికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నది. ఇంతకీ ఆయన మొసలిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడనేగా మీ డౌటూ..!
మెక్సికోలోని ఓ చిన్న గ్రామంలో మొసలిని పెళ్లి చేసుకునే ఆచారం కొనసాగుతున్నది. దక్షిణ మెక్సికోలోని సాన్ పెడ్రో హుమెలులా గ్రామంలో మరీ ఈ ఆచారాన్ని నిష్టగా పాటిస్తున్నారు. మొసలిని పెళ్లి చేసుకుంటే ప్రకృతి వారిని అనుగ్రహిస్తుందని వారి నమ్మకం. తద్వార విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కుంటలు, కొలనులు, చెరువులు నిండుతాయని విశ్వసిస్తారు. తద్వార చేపల వ్యాపారంపై ఆధారపడే ఆ గ్రమం సస్యశ్యామలం అవుతుందని భావిస్తారు. అందుకే శతాబ్దాల కిందటి ఈ ఆచారాన్ని ఇంకా తూ చా తప్పకుండా పాటిస్తున్నారు.
ఈ ఆచారంలో భాగంగా తాజాగా ఆ గ్రామ మేయర్ విక్టర్ హ్యూగో సోసా ఏడేళ్ల మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఏడేళ్ల మొసలిని పెళ్లికి ముస్తాబు చేశారు. తెల్లటి దుస్తులు తొడిగించారు. అలంకరించారు. దాని నోరును తెరువకుండా కట్టేశారు. తద్వార ముప్పును అరికట్టారు. అలాగే, మేయర్‌ను కూడా ఆనవాయితీకి అనుగుణంగా తయారు చేశారు.
కలర్‌ఫుల్‌గా నిర్వహించిన ఈ వేడుకకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతున్నది. అందులో స్థానికులు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ మొసలిని ముద్దు పెట్టుకుని పెళ్లిని ధ్రువపరుచుకోవాలని కోరారు. వారి విజ్ఞప్తిని పెళ్లి కొడుకైన ఆ మేయర్ అంగీకరించాడు. ఆ మొసలి ముట్టెపై ముద్దు పెట్టాడు. అందరితో కలిసి ఆ మొసలిని చేతిలో పట్టుకుని డ్యాన్స్ చేశాడు.
ఈ ఆచారం హిస్పానిక్‌ల కాలం కంటే కూడా ముందు నుంచి ఉన్నట్టు చెబుతున్నారు. ఎవాక్సాకా రాష్ట్రంలో చొంటాల్, హువే అనే గిరిజన తెగలు ఉన్నాయి. ఈ తెగలు ప్రకృతి అనుగ్రహం కోసం ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ పెళ్లి గురించి మేయర్ సోసా మాట్లాడుతూ, తాము ప్రకృతిని సరిపడా వర్షాలను కోరుతున్నామని వివరించారు. సరిపడా ఆహారాన్ని అందించాలని, తమ నదుల్లో చేపలు విరివిగా లభించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
శతాబ్దాల కిందటి ఈ ఆచారం ఇప్పుడు కొంత పలుచబడుతున్నది. అంటే ఇందులో క్యాథలిక్ స్పిరిచ్యూవాలిటీ చొరబడినట్టు స్థానికులు కొందరు విశ్లేషించారు.