48 ఏళ్ల కిందటి తన రెజ్యూమే షేర్ చేసిన బిల్ గేట్స్.. సోషల్ మీడియాలో వైరల్.. కుబేరుడి రెజ్యుమేపై కామెంట్ల వర్షం

By Mahesh KFirst Published Jul 2, 2022, 5:09 PM IST
Highlights

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన బిల్ గేట్స్ 48 ఏళ్ల కిందటి తన రెజ్యుమేను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ రెజ్యుమే వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో విరుచుకపడ్డారు.
 

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో ముందు వరుసలో ఉన్న సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ బిల్ గేట్స్ ఎంతో మందికి రోల్ మోడల్. కెరీర్‌లో బిల్ గేట్స్ తరహా సక్సెస్ కావాలని ఎందరో కలలు కంటుంటారు. ముఖ్యంగా టెక్ రంగంలో ఆయన మైక్రోసాఫ్ట్ సంస్థ సహవ్యవస్థాపకుడిగా దాదాపు అందరికీ సుపరిచితమే. ఆయన సీక్రెట్లు తెలుసుకుని సక్సెస్ కావాలని ఎందరో ఆరాటపడుతుంటారు. అయితే, అలాంటి వారికి స్వయంగా బిల్ గేట్స్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన వివరాలే కాదు.. ఏకంగా 48 ఏళ్ల కిందటి తన రెజ్యూమేను లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ రెజ్యూమే కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఎవరికైనా రెజ్యుమే తయారు చేయడమంటే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక లోపం ఉన్నట్టు ఒక రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా అక్షరం అక్షరం టైప్ చేస్తుంటారు. తాము కలలు కన్న ఉద్యోగం కోసం ఎంతో శ్రమించి రెజ్యుమే రూపొందించుకుంటారు. ఇందుకోసం వారు ఎంతో మంది రెజ్యుమేలు పరిశీలిస్తుంటారు. కానీ, ఏకంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెజ్యుమేనే నేరుగా చూసే అవకాశం వస్తుందని ఎవరూ ఊహించారు. బిల్ గేట్స్ షాక్ ఇస్తూ తన 48 ఏళ్ల కిందటి రెజ్యుమేను లింక్డ్ ఇన్ లో షేర్ చేసుకున్నారు. దానికి అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. మీరు ఇటీవలే డిగ్రీ పూర్తిచేసినా.. కాలేజీ డ్రాపౌట్లు అయినా.. కచ్చితంగా తన కంటే మెరుగైన రెజ్యుమే తయారు చేస్తారని పేర్కొన్నారు. తన రెజ్యుమేనూ షేర్ చేశారు.

ఈ రెజ్యుమేలో రెఫరెన్స్ వివరాలు, బిల్ గేట్స్ వ్యక్తిగత వివరాలూ అందులో ఉన్నాయి. ఆయన హార్వర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్‌లో ఉన్నట్టు.. తాను చేరిన కోర్సుల వివరాలను అందులో ఆయన పేర్కొన్నారు. తన అనుభవాలు, నైపుణ్యాలనూ రెజ్యుమేలో పంచుకున్నారు. అంతేకాదు, తన రెజ్యుమేలో ఆయన తన ఫుల్ నేమ్ విలియం హెన్రీ గేట్స్‌గా వెల్లడించారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్, డేటా బేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ కన్‌స్ట్రక్షన్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి కోర్సుల్లో తాను చేరినట్టు వివరించారు.

ఇన్ని ఆసక్తికర వివరాలను వెల్లడించిన ఆ రెజ్యుమే సోషల్ మీడియాలో వైరల్ కావడం సహజం. ఈ రెజ్యుమే‌పై కుప్పలు తెప్పులుగా కామెంట్లు వచ్చాయి. బిల్ గేట్స్ రెజ్యుమే ఎలా ఉంటుందా? అని తాను ఎన్నోసార్లు ఆలోచించానని, ఎట్టకేలకు స్వయంగా మీరే వెల్లడించినందుకు ధన్యవాదాలు అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. మరొకరు క్లాసిక్, స్ట్రెయిట్ ఫార్వర్డ్, సిన్సియర్ అంటూ కామెంట్ చేశాడు. అప్పట్లో రెజ్యుమేలో హెయిట్, వెయిట్, తనపై ఆధారపడిన వ్యక్తుల వివరాలనూ ఇవ్వాల్సి ఉండేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇప్పుడు అలాంటి వివరాలేమీ అడగట్లేదని పేర్కొన్నాడు.

click me!