
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం విరమించుకోవాలని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పలుమార్లు రష్యాకు విజ్ఞప్తి చేసింది. ఐరాస కౌన్సిల్ శాశ్వత సభ్య దేశాలు సైతం రష్యా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. యూరప్ దేశాలు సైతం ఉక్రెయిన్ మద్దతుగా నిలుస్తున్నాయి. చాలా దేశాల్లో ప్రజలు సైతం రష్యా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలు ఈ క్రమంలోనే అమెరికా, దాని మిత్ర దేశాలు ఇప్పటికే రష్యాపై వాణిజ్య ఆంక్షలు విధించగా.. మరిన్ని చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇక రష్యాలోని ప్రజలు సైతం ఉక్రెయిన్‌పై ప్రభుత్వ మిలిటరీ చర్యను నిరశిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే వేలాది మంది యుద్ధం వద్దంటూ నిరసనకు దిగిన రష్యన్లను ఆదేశ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్ వీధుల్లో వేలాది మంది రష్యన్లు ఆందోళనకు ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఆపాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గళమెత్తారు. నో వార్.. యుద్ధం వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గురువారం రాత్రి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రధాన వీధి అయిన నెవ్‌స్కీ ప్రోస్పెక్ట్‌లో గుమిగూడిన చాలా మంది రష్యన్ యువకులు గుంపుగా నినాదాలు చేశారు. దేశంలోని అనేక నగరాల్లో వేలాది మంది రష్యన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన వందలాది ఇప్పటివరకు ఆందోళనలు చేసిన 1700 మందిని రష్యాను అధికారులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
అంతకుముందు గురువారం నాడు.. డజన్ల కొద్దీ జర్నలిస్టులు, విలేకరులు, మీడియా ప్రముఖులు రష్యా కార్యకలాపాలను ఖండిస్తూ ఓ పిటిషన్‌పై సంతకం చేశారు. అలాగే, మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, సమారా, రియాజాన్ మరియు ఇతర నగరాల నుండి వంద మందికి పైగా మునిసిపల్ డిప్యూటీలు రష్యా పౌరులకు బహిరంగ లేఖపై సంతకం చేశారు. "ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమైన మేము ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడిని నిస్సందేహంగా ఖండిస్తున్నాము" అని లేఖలో పేర్కొన్నారు. "ఇది అసమానమైన దురాగతం, దీనికి సమర్థన ఉన్నా.. ఈ హింసను సమర్థించకూడదు" అని వెల్లడించారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో, నిరసనకారులు చారిత్రక గోస్టినీ డ్వోర్ షాపింగ్ ఆర్కేడ్ వెలుపల స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు గుమిగూడడం ప్రారంభించారు. భారీ పోలీసు బందోబస్తు నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. యుద్ధం ఆపాలంటూ.. గళమెత్తిన క్రమంలో.. అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ర్యాలీ ప్రారంభమైనప్పుడు, పోలీసులు అప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఇది అనధికారిక ప్రదర్శన అనీ, ఎవరైనా హాజరైతే అరెస్టు.. విచారణకు గురికావచ్చని లౌడ్ స్పీకర్లతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అక్కడున్న నిరసనకారులు "ఉక్రెయిన్ మా శత్రువు కాదు!".. "రష్యా యుద్ధానికి వ్యతిరేకం!" అంటూ చప్పట్లు కొడుతూ.. హోరెత్తించారు. చాలా దేశాల్లో ఇలా రష్యాకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.