ఆఫ్ఘనిస్తాన్‌ మసీదులో భారీ పేలుడు.. ప్రముఖ మత గురువుతో పాటు 18 మంది మృతి..

By Sumanth KanukulaFirst Published Sep 2, 2022, 5:03 PM IST
Highlights

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ మసీదులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 18 మంది మరణించారు. ఇందులో ఒక ప్రముఖ మత గురువు ఉన్నట్టుగా తాలిబన్ అధికారులు తెలిపారు. 

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ మసీదులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 18 మంది మరణించారు. ఇందులో ఒక ప్రముఖ మత గురువు ఉన్నట్టుగా తాలిబన్ అధికారులు, స్థానిక వైద్యుడు తెలిపారు. 20 మందికి పైగా గాయపడినట్టుగా చెప్పారు. వివరాలు.. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ హెరాత్‌లోని గుజార్‌గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది.  ప్రముఖ మతగురువు ముజీబ్-ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు. అతని మరణాన్ని తాలిబాన్ చీఫ్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధ్రువీకరించారు. 

‘‘దేశానికి చెందిన బలమైన, ధైర్యమైన మత గురువు క్రూరమైన దాడిలో వీరమరణం పొందాడు’’ అని జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఇక, అన్సారీ తాలిబన్‌లకు సన్నిహితునిగా కనిపించారు. గత రెండు దశాబ్దాలుగా దేశంలోని పాశ్చాత్య-మద్దతు గల ప్రభుత్వాలపై చేసిన విమర్శలకు ఆఫ్ఘనిస్తాన్ అంతటా అన్సారీ ప్రసిద్ధి చెందారు. అయితే ఈ పేలుడు వెనక ఉన్నది ఎవరనేది తెలియరాలేదు. ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ఇందుకు బాధ్యత వహించలేదు. 

ఇక, అంబులెన్స్‌లు 18 మృతదేహాలను, 21 మంది క్షతగాత్రులను పేలుడు జరిగిన చోటు నుంచి హెరాత్‌లోని ఆసుపత్రులకు తరలించాయని హెరాత్ అంబులెన్స్ సెంటర్ అధికారి మహ్మద్ దౌద్ మొహమ్మది తెలిపారు.

click me!