
భావోద్వేగాలను దేనితోనూ కొనలేం. అలాంటి ఉద్వేగాల్లో ప్రేమ ఒకటి. దీనికి అందరూ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారు. కానీ, దురదృష్టవశాత్తు దీన్ని వీక్ పాయింట్‌గా మార్చుకుని జరుగుతున్న నేరాలు అన్నీ ఇన్నీ కావు. మనకు నేరాలే కనిపిస్తున్నంత మాత్రానా నిజమైన ప్రేమ భ్రమేనా అనుకుంటే పొరబాటే. నిజమైన ప్రేమలూ ఉంటాయి. కానీ, వాటికి పెద్దగా ప్రాచుర్యం ఉండదు. అలాంటి నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ కథే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తన ప్రేమను వేల కోట్ల రూపాయలతో కొలవలేవని మలేషియాలో బిజినెస్ టైకూన్ అయిన తండ్రికి ముఖం మీదే చెప్పేసి ఆ యువతి తన ప్రేమికుడిని పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ కథ ఇలా ఉన్నది.
మలేషియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కే పెంగ్, మాజీ మిస్ మలేషియా పాలైన ఛాయ్ దంపతులు. వీరికి ఏంజెలినా ఫ్రాన్సిన్ ఖూ అనే అందమైన కూతురు ఉన్నది. ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివించారు. ఈ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కరీబియన్‌లో జన్మించిన జేడియాతో పరిచయం ఏర్పడింది. జేడియా సైంటిస్టు. కానీ, గొప్పగా ఆస్తులేమీ లేని సాదాసీదా యువకుడు. ఆస్తుల, హోదాల అంచనాలు పట్టించుకోకుండా.. కేవలం మంచి మనిషిగా జేడియాను ఏంజెలినా ఫ్రాన్సిస్ ఖూ ఇష్టపడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చారు.
ఇదే విషయాన్ని ఏంజెలినా ఫ్రాన్సిస్ ఖూ తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు జెడియా గురించి అడిగారు. ఆయనకు ఆస్తిపాస్తులేమీ లేవని గుర్తించారు. మనకు తగిన ఆస్తిపాస్తులు, హోదాలు లేని సాదాసీదా మనిషి అని తండ్రి పేర్కొంటూ బిడ్డ వివాహ ప్రతిపాదనను తిరస్కరించాడు. కానీ, బిడ్డ ఖూ ఊరుకోలేదు. జేడియానే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది. చివరకు తండ్రి ఆమెకు ఓ ఆప్షన్ ఇచ్చాడు. తన నుంచి దక్కే వేల కోట్ల రూపాయలనైనా ఎంచుకో? లేదంటే జేడియానైనా ఎంచుకో అని సూచించాడు.
Also Read: విమానంలో పాడుపని.. ఆమె పక్కనే కూర్చుని లైంగిక స్వయంతృప్తి.. వైద్యుడి అరెస్టు
చివరకు ఏంజెలినా ఫ్రాన్సిస్ ఖూ ఓ నిర్ణయానికి వచ్చింది. తనకు ఆస్తి కన్నా.. అతగాడే కావాలని గట్టిగా అనుకుంది. వారసత్వంగా వస్తున్న వేల కోట్లను ఏంజెలినా ఫ్రాన్సిస్ ఖూ తృణప్రాయంగా వదిలిపెట్టింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. 2008లో జేడియాను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. వారసత్వంగా వచ్చే సుమారు 2 వేల కోట్ల ఆస్తిని ఆమె ఉద్దేశపూర్వకంగానే వదిలిపెట్టేసింది.
జేడియాను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ రెండు కుటుంబాలు కలువలేదు. దూరంగానే ఉండిపోయాయి. కానీ, ఏంజెలినా ఫ్రాన్సిస్ ఖూ తన తల్లిదండ్రులను కలవాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారు. వారి విడాకుల కేసు కోర్టుకు చేరింది. అందులో బిడ్డ ఏంజెలినా ఫ్రాన్సిస్ ఖూ తన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి వచ్చింది. తల్లిని గొప్ప వ్యక్తిగా పేర్కొంటూ తండ్రిపై విమర్శలు చేసిన ఏంజెలినా.. ఏమైనా తన తల్లిదండ్రులు కలిసి ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. 2008లో పెళ్లి జరిగినా.. తాజా ఘటనతో వారి లవ్ స్టోరీ కాస్తా సోషల్ మీడియాలో సంచలనమైంది.