రష్యా కలలు కల్లలు : సాఫ్ట్ ల్యాండింగ్‌లో సమస్య, చంద్రునిపై కూలిపోయిన లూనా-25 .. అందరి చూపు చంద్రయాన్ 3పైనే

Siva Kodati |  
Published : Aug 20, 2023, 03:04 PM ISTUpdated : Aug 20, 2023, 03:08 PM IST
రష్యా కలలు కల్లలు : సాఫ్ట్ ల్యాండింగ్‌లో సమస్య, చంద్రునిపై కూలిపోయిన లూనా-25 .. అందరి చూపు చంద్రయాన్ 3పైనే

సారాంశం

రష్యా ఆశలు ఆడియాశలయ్యాయి. చంద్రునిపైకి మాస్కో ప్రయోగించిన లూనా 25 ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ మేరకు మిషన్ ఫెయిల్ అయినట్లుగా రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్ ప్రకటించింది. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో పాటు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్ కూడా చంద్రుడి పైకి ల్యాండర్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇవి రెండు అటు ఇటుగా చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండింటిలో ఏది ముందుగా చంద్రుడిపై దిగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందే రష్యా ప్రయోగించిన లూనా 25 ల్యాండర్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దాని పురోగమనంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ సమస్యను విశ్లేషించేందుకు రష్యా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. 

అయితే అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం.. లూనా 25 ప్రయోగం విఫలమైందట. లూనా 25 ల్యాండర్ అదుపుతప్పి చంద్రుడిపైకి దూసుకెళ్లినట్లుగా రాయిటర్స్ తెలిపింది. దీంతో దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా చంద్రునిపై చేపట్టిన తొలి మిషన్ విఫలమైంది. శనివారం సాయత్రం చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తున్న లూనార్ 25.. ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌కు చేరేందుకు కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఈ దశలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్ధితి తలెత్తింది. ప్రీ లాండింగ్ కక్ష్యలోకి ప్రవేశించిన కాసేపటికే క్రాఫ్ట్‌తో సంబంధాలు తెగిపోయినట్లుగా రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ల్యాండర్ అనూహ్య కక్ష్యలోకి వెళ్లిందని.. చంద్రుని ఉపరితలంతో ఢీకొన్న కారణంగా దాని నుంచి సంకేతాలు రావడం లేదని రోస్‌కాస్మోస్ వెల్లడించింది. 1957లో స్పుత్నిక్ 1 వ్యోమనౌక ద్వారా సోవియట్ యూనియన్ విజయవంతంగా మనిషిని అంతరిక్షంలో ప్రవేశపెట్టగలిగింది. సోవియట్ వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.

అయితే 1976లో రష్యా అధ్యక్షుడిగా వున్న లియోనిడ్ బ్రెజ్నెవ్ కాలంలో చంద్రునిపైకి ప్రయోగించిన లూనా -24 తర్వాత.. మాస్కో ఇప్పటి వరకు చంద్రుని మిషన్‌ను ప్రయత్నించలేదు. ఇలాంటి దశలో దాదాపు 47 ఏళ్ల తర్వాత లూనా 25ను ప్రయోగించగా.. ఇది ఆగస్టు 21న చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగాల్సి వుంది. కానీ ఈ లోగా మిషన్ ఫెయిల్ కావడంతో రష్యా శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ  వ్యక్తం చేస్తున్నారు. 

లూనా 25 ఇప్పటికే చంద్రుడికి సంబంధించిన ఫోటోలను పంపించింది. లూనా 25 ప్రయోగాన్ని ఆగస్ట్ 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. రష్యా మిషన్ ఫెయిల్ కావడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3పై పడింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ చంద్రునికి 25 కి.మీ నుంచి 134 కి.మీ దూరంలో వున్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. దీంతో చివరి దశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో దృష్టి పెట్టింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపనుంది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !