కిమ్ వర్ధంతి కారణంగా ఉత్తర కొరియాలో నవ్వడం నిషేధం.. విచారించని వారిపై నిఘా

By Mahesh KFirst Published Dec 17, 2021, 12:49 PM IST
Highlights

కిమ్ జోంగ్ ఇల్ పదో వర్ధంతి సందర్భంగా ఉత్తర కొరియాలో విచిత్ర నిబంధనలు అమలు అవుతున్నాయి. 11 రోజులు దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా పాటిస్తున్నారు. ఈ కాలంలో ప్రజలు నవ్వడంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఆల్కహాల్ తాగరాదు.. వినోద కార్యక్రమాల్లో పాలుపంచుకోరాదు. ఇంట్లో మనిషి చనిపోయినా.. బిగ్గరగా ఏడవరాదు.  అంతేకాదు, సరిపడా విచారం వ్యక్తం చేయనివారిపైనా నిఘా వేయనున్నారు. ఈ నిబంధనలు పాటించకుంటే భావజాల నేరస్తులుగా పరిగణించి ఖైదు చేయనున్నారు. ఇది వరకు ఈ ఆరోపణల కింద తీసుకు వెళ్లిన వారి అడ్రస్ లేకుండా పోయిందని కొందరు చెప్పారు.

న్యూఢిల్లీ: North Korea అంటేనే అందరికీ విచిత్ర చట్టాలు, కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) హెచ్చరికలు గుర్తుకు వస్తుంటాయి. చాలా వరకు ఆ దేశ చట్టాలు, నిబంధనలు బయటకు పొక్కవు. అంతా గుట్టుగా ఉంటుంది. కానీ, వెలికి వచ్చిన రూల్స్ మాత్రం విస్తూపోయేలా ఉంటాయి. తాజాగా, మరోసారి అలాంటి నిబంధనలే వెలుగులోకి వచ్చాయి. ఉత్తర కొరియా మాజీ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఇల్ పదేళ్ల క్రితం మరణించాడు. ఆయన పదో వర్ధంతి సందర్భంగా ఈ దేశంలో డిసెంబర్ నెల మొత్తం సంతాప నెలగా ప్రకటించుకున్నారు. ఈ నెలలో ప్రజలపై ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా 11 రోజులను మాత్రం సంతాప దినాలుగా పాటిస్తున్నారు. కిమ్ జోంగ్ ఇల్ డిసెంబర్ 17న మరణించారు. ఆయన 1994 నుంచి 2011 వరకు దేశాన్ని పాలించారు. ఆయన తర్వాత ప్రస్తుత సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు తీసుకున్నారు.

అందుకోసమే ఈ నెల ప్రారంభంలోనే విచిత్రమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ సంతాప దినాల(Mourning Period) కాలంలో ఎవరూ నవ్వకూడదు(Ban on Laugh). ఆల్కహాల్ సేవించరాదు. కనీసం ఆటవిడుపు కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదు. అలాంటివి నిర్వహించడమే నిషేధం. అంతేకాదు, సరిగ్గా పదో వర్ధంతి రోజున కిరాణా షాపులు కూడా మూసే ఉండనున్నాయి. ఒక వేళ ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. వారిని భావజాల నేరస్తులుగా పరిగణిస్తారు. ఆ ఆరోపణలతో తీసుకెళ్లిన వారు ఎవరూ మళ్లీ తిరిగి రాలేదు. ఉత్తర కొరియాకు చెందిన కొందరు ఈ విషయాలను రేడియో ఫ్రీ ఆసియాకు వివరించారు.

Also Read: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం: 2025 వరకు కొంచెం కొంచెం తినండి.. ప్రజలకు కిమ్ ఆదేశాలు

ఈ సంతాప దినాల కాలంలో ఎవరైనా మరణించినా.. వారి కుటుంబ సభ్యులు బిగ్గరగా ఏడవరాదు. పుట్టిన రోజులు జరుపుకోరాదు. ఉత్తర కొరియాకు చెందిన మరొకరు ఈ నిబంధనల గురించి మాట్లాడుతూ, ఈ సంతాప దినాల్లో ఎవరైనా సరిపడా విచారం వ్యక్తం చేయనివారిపైనా నిఘా వేయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయని వివరించారు. డిసెంబర్ నెల ప్రారంభం నుంచి కిమ్ జోంగ్ ఇల్ మరణంపై సామూహిక విచారానికి భంగం కలిగిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఇవి పోలీసులకు ప్రత్యేక విధులుగా ఈ నెలలో ఉండనున్నాయి. అంతేకాదు, శాంతి సుస్థిరత కోసం పని చేసే ఈ అధికారులు ఈ కాలంలో అసలు పడుకోవద్దనే ఆదేశాలూ ఉన్నాయని వెల్లడించారు.

ఇలాంటి విచిత్ర ఆదేశాలకు ఉత్తర కొరియా కేరాఫ్‌గా ఉంటూ వస్తున్నది. గతంలోనూ ఇలాంటి విచిత్ర ఆదేశాలు ఎన్నో అమలు అయ్యాయి. ఇదే ఏడాది తొలినాళ్లలో కిమ్ జోంగ్ ఉన్ పాశ్చాత్య సంస్కృతి ఇక్కడ చలామణి కాకుండా చూడటానికి కఠిన నిబంధనలు ప్రకటించారు. స్కిన్నీ జీన్స్ ధరించడం, ముల్లెట్ హెయిర్‌ స్టైల్‌లపై నిషేధం విధించారు. వీటితో పాశ్చాత్య సంస్కృతి ఉత్తర కొరియాలో వ్యాపించే ముప్పు ఉన్నదని వారు భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరు తెలిపారు. కిమ్ జోంగ్ ఉన్ ధరించడంతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన ట్రెంచ్ కోట్‌లు ధరించడంపైనా ఆంక్షలు ఉన్నాయి.

click me!