నేడు ఆకాశంలో అద్భుతం.. గురు, శనిగ్రహాల మహా సంయోగం..

By AN TeluguFirst Published Dec 21, 2020, 9:22 AM IST
Highlights

ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సోమవారం రాత్రి గురు, శని గ్రహాల ‘కలయిక’ జరగనుంది. భూమి మీద నుంచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన ఒకే నక్షత్రంలా కనిపించనున్నాయి. దాదాపు 400యేళ్ల తర్వాత చోటు చేసుకుంటున్న ఈ ఘట్టం చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సోమవారం రాత్రి గురు, శని గ్రహాల ‘కలయిక’ జరగనుంది. భూమి మీద నుంచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన ఒకే నక్షత్రంలా కనిపించనున్నాయి. దాదాపు 400యేళ్ల తర్వాత చోటు చేసుకుంటున్న ఈ ఘట్టం చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమి నుంచి చూసినప్పుడు రెండు గ్రహాలు ఆకాశంలో ఒకేచోటుకు వచ్చినట్లు కనిపిస్తే దాన్ని సంయోగం అంటారు. ఆ సందర్భంలో అవి మామూలు దూరం కంటే బాగా దగ్గరగా ఉంటాయన్న మాట. అయితే మిగతా గ్రహాల విషయంలో ఇది తరచుగా జరుగుతున్నా.. గురుడు, శని గ్రహాల కలయిక చాలా అరుదు. 

సౌర కుటుంబంలోని అతి పెద్దదైన గురు గ్రహం సూర్యుని నుంచి ఐదోది. రెండో అతిపెద్ద గ్రహమైన శని, సూర్యుని నుంచి ఆరోది. సూర్యని చుట్టూ తిరగడానికి గురుడికి 12 ఏళ్లు పడితే, శనికి 30 ఏళ్లు పడుతుంది. పరిభ్రమణ సమయంలో ప్రతి 20 యేళ్లకు ఒకసారి ఈ రెండు గ్రహాలు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. అత్యంత దగ్గరగా ఒకే వరసలో ఉన్నట్లు కనిపించడం మాత్రం అరుదు. ఇది సోమవారం ఆవిష్కృతం కానుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఇలా గ్రహాలు కలవడాన్ని సంయోగంగా పిలుస్తామని.. దీన్ని మాత్రం ‘మహా సంయోగం’ (గ్రేట్ కంజంక్షన్)గా పేర్కొంటున్నామని తెలిపారు. ఆ సమయంలో భూమి నుంచి చూస్తున్నప్పుడు రెండు గ్రహాలు 0.1 డిగ్రీల మేర మాత్రమే దూరంగా ఉంటాయని చెప్పారు. చివరిసారిగా ఇవి 1623 సంవత్సరంలో ఇంత దగ్గరగా వచ్చాయి. పైగా ఇలాంటి సంయోగం రాత్రి వేళ జరగడం.. 800యేళ్లలో ఇదే మొదటిసారి. 

తాజా సంయోగంలో రెండు గ్రహాలు పరస్పరం దగ్గరగా వచ్చినట్లు కనిపించినప్పటికీ ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. ముందు భాగంలో ఉండే గురు గ్రహం.. అప్పుడు భూమికి 89 కోట్ల కి. మీ. దూరంలో ఉంటుంది. మళ్లీ ఈ గ్రహాలు 2080 మార్చి 15న ఈ స్థాయిలో చేరువగా వస్తాయి.

భారత్ లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ మహా కలయికను మామూలు కంటితో చూడొచ్చు. సోమవారం సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషల వరకు నైరుతి, పశ్చిమ దిక్కల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడాన్ని చూడొచ్చు. గురుగ్రహం కొంచెం పెద్దగా, ప్రకాశవంతమైన నక్షత్రంలా దర్శనమిస్తుంది. దానికి ఎడమభాగంలో.. కొంచెం పైన శని కొంచెం మసకగా  కనిపిస్తుంది. రెండింటినీ స్పష్టంగా, విడివిడిగా చూడాలంటే బైనాక్యులర్ ను ఉపయోగించాలి. చిన్నపాటి టెలిస్కోపును వాడితే గురుగ్రహం చుట్టూ ఉన్న నాలుగు పెద్ద చందమామలూ కనిపిస్తాయి. 

మరోవైపు, కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోని బిర్లా ప్లానెటోరియంలో ‘మహా సంయోగాన్ని’ చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదని సంస్థ డైరెక్టర్ బీజీ సిద్ధార్థ తెలిపారు. 

click me!