
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కేన్ టనాకా మృతి చెందారు. జపాన్ దేశానికి చెందిన కేన్ టనాకా.. 119 ఏళ్లు జీవించింది. అయితే ఆమె ఏప్రిల్ 19న మరణించినట్టుగా జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ సోమవారం ప్రకటించింది. కేన్ టనాకా విషయానికి వస్తే.. జపాన్‌లోని నైరుతి ఫుకుయోకా ప్రాంతంలో 1903 సంవత్సరం జనవరి 2న జన్మించారు. తన 19 ఏళ్ల వయసులో హిడియో టనాకాను వివాహం చేసుకుంది. నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక, ఐదవ బిడ్డను దత్తత తీసుకుంది.
1937లో రెండో చైనా, జపాన్ యుద్ధంలో పాల్గొనేందుకు భర్త, పెద్ద కుమారుడు వెళ్లిన సమయంలో కానే నూడుల్స్ దుకాణం నడిపారు. సోడా, చాక్లెట్ సహా రుచికరమైన ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తన సుదీర్ఘ ఆయువుకు కారణమని చెప్పేవారు. ఈ ఏడాది జనవరిలో ఆమె 119వ పుట్టినరోజు జరుపుకున్నారు.
2019 మార్చి నెలలో గిన్నిస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా కేన్ టనాకాను గుర్తించింది. అప్పటికి ఆమె వయసు 116 ఏళ్లు. ఆ సమయంలో జీవితంలో ఏ క్షణంలో అత్యంత సంతోషంగా ఉందని కేన్ టనాకాను అడిగారు. అందుకు ఆమె "ఇప్పుడు" అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత.. 2020 సెప్టెంబర్‌లో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్ వ్యక్తిగా కేన్ టనాకా నిలిచారు. అప్పటికి ఆమె వయసు 117 ఏళ్ల 261 రోజులు.
ఇదిలా ఉంటే.. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం.. జపాన్ ప్రపంచంలో అత్యధిక వృద్ధులను కలిగి ఉంది. అక్కడి జనాభాలో దాదాపు 28 శాతం మంది 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు. జపాన్‌లో వందేళ్లు దాటుతున్న వృద్ధుల సంఖ్య సుమారు 85 వేలమందికి పైనే ఉంది. గతేడాది సెప్టెంబర్ నాటికి
86,510 మంది వయసు వందేళ్లు దాటినవారు ఉన్నారు. ఇందులో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది ఆడవాళ్లే ఉంటున్నారు.
ఇక, 1997లో 122 సంవత్సరాల 164 రోజుల వయస్సులో మరణించిన ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్‌ను .. అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ చేత ధ్రువీకరించబడింది.