
Russia's Lavrov warns of 'real' danger of World War III: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యాను సేనలు దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ లో ఎటుచూసినా శిథిలాల దిబ్బలుగా ఆ దేశ నగరాలు మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మూడో ప్రపంచ యుద్ధం గురించి హెచ్చరించారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ యుద్దం నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలను కలిసి చర్చలు జరపనున్నారు. ఈ వారం మాస్కోకు వెళ్లే ముందు అంకారాను సందర్శించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చల కోసం కైవ్ కు గుటెర్రెస్ వెళ్తారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
ఈ తరుణంలోనే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మూడో ప్రపంచ యుద్ధం గురించి హెచ్చరించారు. సెర్గీ లావ్‌రోవ్ సోమవారం అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు కొనసాగుతాయని పేర్కొంటూనే..మూడవ ప్రపంచ యుద్ధ నిజమైన ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలు రష్యా తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే.. గత నెల (మార్చి) ప్రారంభంలో కూడా ఆయన మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడారు. ఒక వేళ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే.. అందులో న్యూక్లియర్ బాంబుల (అణుబాంబుల) వినియోగం ఉంటుందని, విధ్వంసం తప్పదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నాటోలో చేరితే అణ్వాయుధాలు తమ దేశ సరిహద్దులోకి వస్తాయని తెలిపారు. ఒక వేళ కీవ్ అణ్వాయుధాలు పొందితే అసలైన ముప్పు ఏర్పడుతుందని వివరించారు. కాబట్టి, ఉక్రెయిన్ అణ్వాయుధాలు పొందటాన్ని రష్యా అనుమతించబోదని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడితే ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తమకు తెలుసు అని అప్పుడే స్పష్టం చేసిన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్.. అందుకు రష్యా సిద్ధమయ్యే ముందడుగు వేసిందని తెలిపారు. మరోసారి ఆయన మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడటం.. ఉక్రెయిన్ పై అణుబాంబుల దాడికి రష్యా దిగబోతున్నదా? అనే ప్రశ్నలను లేవదీస్తున్నది. మూడో ప్రపంచ యుద్దం గురించి హెచ్చరించడంతో పాటు ఉక్రెయిన్ తీరుపై సెర్జీ లావరోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ విధానం పై విమర్శలు గుప్పించాడు. "మంచి సంకల్పానికి దాని పరిమితులు ఉన్నాయి. కానీ అది పరస్పరం కానట్లయితే, అది చర్చల ప్రక్రియకు సహాయం చేయదు. కానీ మేము (ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్) జెలెన్స్కీచే నియమించబడిన బృందంతో చర్చలు కొనసాగిస్తున్నాము.. ఇక ముందు కూడా కొనసాగుతాయి" అని అన్నారు.
ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా.. మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాదం రావడం నిజమే అని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ అన్నారు. "ప్రమాదం చాలా తీవ్రమైనది, ఇది నిజం, మీరు దానిని తక్కువ అంచనా వేయలేరు" అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ గురించి "ఒక ఒప్పందంపై సంతకం చేయడంతో ప్రతిదీ పూర్తవుతుందని తాను విశ్వసిస్తున్నాను. కానీ ఈ ఒప్పందం పారామితులు ఒప్పందం రియాలిటీలోకి వచ్చిన క్షణంలో జరిగే పోరాట స్థితి ద్వారా నిర్వచించబడతాయి" అని అన్నారు.