
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా పశ్చిమ నగరమైన వాకయామాలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. దీంతో ఆయనను వెంటనే అక్కడి నుంచి తరలించారు. జపాన్ మీడియా నివేదికల ప్రకారం.. ప్రధాని ఫుమియో కిషిడా వాకయామాలోని పోర్ట్‌ను సందర్శించిన తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పేలుడు జరిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అక్కడి నుండి బయటకు తీసుకెళ్లారు.
ప్రధాని ఫుమియో కిషిడా ప్రసంగం చేస్తున్న సమయంలో పైపు లాంటి వస్తువు విసిరినట్లు జపాన్ మీడియా నివేదించింది. పెద్ద పేలుడు శబ్దం కూడా వినిపించింది, అయితే ఘటనా స్థలంలో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే తెలిపింది. అయితే అక్కడ స్మోక్ బాంబ్ విసిరినట్టుగా అనుమనిస్తున్నారు.
పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే నుంచి వచ్చిన ఫుటేజ్‌లో అనేక మంది పోలీసు అధికారులు ఒక వ్యక్తిని ఘటన స్థలం నుంచి అదుపులోకి తీసుకోవడానికి ముందు నేలపై పిన్ చేయడం కనిపించింది. మరోవైపు ఈ ఘటనతో ప్రజలు అక్కడి నుంచి పారిపోయారు. ఇక, గతేడాది జూలైలో ప్రధాని షింజో అబే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జపాన్‌లో భద్రతను పెంచారు.