టెర్రరిస్ట్ వర్సెస్ టెర్రరిస్ట్: అల్ ఖైదా జవహిరి వీడియోపై ఐఎస్ఐఎస్ ప్రశ్నలు

By telugu teamFirst Published Sep 12, 2021, 8:19 PM IST
Highlights

అమెరికాలో 2001లో జరిగిన 9/11 దాడిపై అల్ ఖైదా తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. అందులో అల్ ఖైదా చీఫ్‌గా లాడెన్ తర్వాత బాధ్యతలు తీసుకున్న జవహిరి ప్రసంగిస్తూ కనిపించారు. ఇప్పటికే జవహిరి మరణించినట్టు వాదనలున్నాయి. దీంతో నిఘావర్గాలు సహా చాలా మందిలో ఈ వీడియో వాస్తవికతపై అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ కూడా వీడియో గురించి అల్ ఖైదాపై ప్రశ్నలు వేసింది.
 

న్యూఢిల్లీ: ఆటవిక చర్యలు, పేలుళ్లతో బీభత్సం సృష్టించే ఉగ్రవాద సంస్థల మధ్య కూడా వైరాలుంటాయి. మానవాళిపై చేసే దాడిలో అన్నింటి వైఖరీ ఒకే తీరుగా ఉంటున్నప్పటికీ వాటి ఛాందసవాదాలు, లక్ష్యాలతో వాటి మధ్య కూడా ఘర్షణలుంటాయని తెలుస్తున్నది. అల్ ఖైదా, ఐఎస్ఐఎస్‌లు రెండూ తీవ్రవాద సంస్థలే అయినా, రెండింటి మార్గాలు వేరని అంచనాలున్నాయి. ఇదే విషయాన్ని తాజా ఘటన ఒకటి మరోసారి రూఢీ చేసింది. అమెరికా పెంటగాన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లను హైజాక్ చేసిన విమానాలతో పేల్చేసిన అల్ ఖైదా ఓ వీడియో విడుదల చేసింది. ఆ దాడికి తెగబడిన అల్ ఖైదా 9/11 ఘటనకు 20ఏళ్లు నిండిన సందర్భంగా వీడియోను ఓ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఆ వీడియోలో ఇప్పటికే మరణించినట్టుగా భావించిన అల్ ఖైదా కీలక నేత అయమన్ అల్ జవహిరి ప్రసంగించడం ఆశ్చర్యపరిచింది. వీడియోల్ ఆయన సుమారు గంటపాటు ఆయన ప్రసంగించారు. కానీ, నిఘావర్గాలు సహా మరో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌కు కూడా ఇదే తరహా అనుమానం వచ్చింది. అల్ ఖైదా నేత జవహిరి ఇప్పటికీ జీవించే ఉన్నట్టు నిరూపించాలని ఆ ఉగ్రవాద సంస్థకు సవాల్ విసిరింది.

అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత జవహిరి ఆ బాధ్యత తీసుకున్నారు. కానీ, గతేడాదే ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ దాడిలో జవహిరి మరణించినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కానీ, ఆయన మరణం, ఇప్పుడు జీవించి ఉంటే వాటిపైనా అల్ ఖైదా స్పందించలేదు. కానీ, తాజాగా ఆయన వీడియోను విడుదల చేసింది. అయితే, ఆ వీడియోలో జవహిరి తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల విజయాన్ని పేర్కొనలేదు. అంతేకాదు, గతేడాది మరణించిన అల్ ఖైదా టెర్రరిస్టులను ప్రశంసించారు. దీంతో ఆ వీడియో నిజమేనా కాదా? అనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి.

యూఎస్ బేస్డ్ సైట్ ఇంటెలిజెన్స్ వివరాల ప్రకారం, జవహిరి తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రస్తావించలేదు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లడాన్ని పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరిలో దోహా ఒప్పందం ఆధారంగా ఆ మాట అనవచ్చు. డిసెంబర్‌లోనే ఆయన మరణించినట్టు రూమర్లు వచ్చాయి. అప్పుడే ఆయన మరణించి ఉండవచ్చు. లేదంటే ఈ ఏడాది జనవరిలోనైనా మరణించి ఉండవచ్చు.

click me!