
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడి(Attack)ని అమెరికా, పశ్చిమ దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యా దాడిలో ముఖ్యంగా ఉక్రెయిన్‌కు చెందిన మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నది. తాము ఉక్రెయిన్ పౌరులపై(Civilians) దాడి చేయబోం అని స్పష్టం చేశారు. తాము యుద్ధం(War) చేయడం లేదని, ఇది కేవలం మిలిటరీ చర్య మాత్రమే అని పేర్కొంది. ఇదిలా ఉండగా, రష్యా తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతుండగా.. చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలు రష్యా వైపు మొగ్గుచూపుతున్నాయి. రష్యా దురాక్రమణ అని ఓ విలేకరి చేసిన ప్రస్తావనను చైనా స్పష్టంగా తిరస్కరించింది. అది దురాక్రమణ(Invasion) కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రష్యా దాడులపై రెండు విధాల చర్చ జరుగుతున్నది. ఒకటేమో ఉక్రెయిన్ వైపు నుంచి మరొకటి రష్యా వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ వైపు నుంచి అమెరికా, యూరప్ దేశాల వాదనలకు అధిక ప్రచారం లభిస్తున్న తరుణంలో రష్యా వాదనలపైనా ఓ లుక్ వేద్దాం. రష్యా ప్రకారం.. వారు చేస్తున్న దాడులు కనీసం నైతికంగానైనా సమర్థనీయమా? పరిశీలిద్దాం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినర్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించడానికి కొన్ని కీలక విషయాలను పరిశీలిద్దాం. ఉక్రెయిన్ తూర్పు భాగంలోని ప్రజలు రష్యా భాష మాట్లాడతారు. రష్యా సంస్కృతిని ఆచరిస్తారు. వారు రష్యానే అంటిపెట్టుకోవాలని బలంగా భావిస్తారు. కాగా, పశ్చిమ భాగం ప్రజలు అభివృద్ధి చెందిన ఐరోపా దేశాల వైపు మొగ్గు చూపుతారు. ఒకప్పుడు యూఎస్ఎస్‌ఆర్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ లో గత కొంతకాలంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పశ్చిమ దేశాల వైపు మొగ్గకుండా రష్యా వైపు నిలబడ్డ దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు రావడంతో ఆయన 2014లో గద్దె దిగాల్సి వచ్చింది. ఆ ఆందోళనలు అమెరికా చేయించినవే అనే ఆరోపణలూ ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ దేశాలు వాటికి అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టూ ఆరోపణలు వచ్చాయి.
రష్యా అధ్యక్షుడు గద్దె దిగిన తర్వాత పశ్చిమ పోకడలకు భిన్నంగా రష్యా మాట్లాడే.. రష్యా సంస్కృతిని ఆచరించే దాని పొరుగునే అంటే తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రజలు కొందరు ప్రభుత్వంపై తిరుగుబాట్లు చేశారు. దొంబాస్ రీజియన్‌లోని రెండు ప్రాంతాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. దొనెత్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(డీపీఆర్), లుహన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(ఎల్‌పీఆర్)లుగా ప్రకటించుకున్నాయి. కానీ, వాటిని దేశాలు మరే దేశాలూ గుర్తించలేవు. అయితే, ఆ ‘తిరుగుబాట్ల’ను అణచివేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన రెఫరెండంలో రష్యాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాని విశ్వసనీయతను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వాదనలూ ఉన్నాయి. అయితే, ఈ రెండు ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలకు, రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదులకు మధ్య భీకర దాడులు జరిగాయి. ఈ దాడుల విరమణకు మిన్స్క్ ఒప్పందాలూ జరిగాయి. కానీ, ఆ ఒప్పందాల ఉల్లంఘనే ఎక్కువ. పశ్చిమ దేశాలూ ఆ ఒప్పందాన్ని లైట్ తీసుకున్నాయి. దీంతో డీపీఆర్, ఎల్‌పీఆర్‌లు తమ భద్రతపై బెంగ పెట్టుకున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఆ రెండు పీపుల్స్ రిపబ్లిక్‌లు తమకు సహాయం చేయాల్సిందిగా రష్యాను కోరాయి. ఉక్రెయిన్ తమపై భీకర దాడులు చేస్తున్నదని, తమ హక్కులు కాపాడాలని రష్యాను అర్థించాయి. అందుకు రష్యా సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ముందుగా ఆ రెండింటిని దేశాలుగా గుర్తించి.. తమ సేనలను అక్కడికి పంపడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించినప్పుడూ.. కొన్ని స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. తాము ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనుకోవడం లేదు. ఉక్రెయిన్ పౌరులపై దాడులు చేయాలని భావించడం లేదు. కేవలం మిలిటరీ స్థావరాలపై పరిమిత స్థాయిలో మాత్రమే దాడులు చేస్తామని పేర్కొంది. ఈ రెండు ప్రాంతాల్లోని ఉక్రెయిన్ పౌరులు వెంటనే తమ ఆయుధాలు పక్కన పెట్టి వారి వారి ఇళ్లల్లకు తిరిగి వెళ్లిపోవాలనీ పుతిన్ పిలుపు ఇచ్చారు. తాము రష్యా మాట్లాడేవారిని రక్షించుకుని తీరుతామని పేర్కొన్నారు. తమ లక్ష్యం దురాక్రమణ కాదని, కేవలం ఆ రెండు ప్రాంత ప్రజల హక్కులు, ప్రయోజనాలు కాపాడటమేనని వివరించారు. ఫారీన్ ఎఫైర్స్ కమిటీ డ్యూమా హెడ్, రష్యా డ్యూమా చట్టసభ్యుడు మాట్లాడుతూ, తాము యుద్ధానికి తెగబడాలనుకోలేదని, ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనుకోవడం లేదని, కేవలం డీపీఆర్, ఎల్‌పీఆర్‌ల సరిహద్దులు కాపాడాలనే ఈ దాడులు చేస్తున్నామని వివరించారు.
ఈ రోజు(ఫిబ్రవరి 25) సాయంత్రం కూడా రష్యన్ డిఫెన్స్ అధికారులు ఇదే విధంగా మాట్లాడారు. తమ తొలి రోజు దాడులు విజయవంతంగా జరిపామని, తమ ట్రూపులు ఉక్రెయిన్ ప్రజలను టార్గెట్ చేయలేదని వివరించారు. కేవలం ఉక్రెయిన్ మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని, అందుకోసం కచ్చితత్వంతో పని చేసే ఆయుధాలను వినియోగిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్న నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరాలనుకోవడమూ ఈ వివాదానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్నది. రష్యా కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవద్దని, నాటో బలగాలు ఆ దేశం నుంచి వెనుదిరగాలని, మరికొన్ని ఇలాంటి డిమాండ్లనే రష్యా పశ్చిమ దేశాల ముందు ఉంచింది. కానీ, వాటిని అవి తిరస్కరించాయి.
ఒక దేశంపై పరిమిత స్థాయిలో అయినప్పటికీ.. కేవలం మిలిటరీ స్థావరాలపైనే అయినప్పటికీ మరో దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టే. కేవలం ఎల్‌పీఆర్, డీపీఆర్‌ల రక్షణ కోసం రష్యా ఈ పరిమిత స్థాయిలో దాడి జరిపిందని నైతికంగా సమర్థించుకోవచ్చు. కానీ, పొరుగు దేశంలో తిరుగుబాటుదారులకు రెఫరెండం నిర్వహించే హక్కూ రష్యాకు ఎక్కడి నుంచి వచ్చిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆ లెక్కకొస్తే.. అమెరికా కూడా ఎన్నో యుద్ధ నేరాలు చేసిందని, పశ్చిమ దేశాల సహా అంతర్జాతీయ చట్టాలను ఎన్నోసార్లు ఉల్లంఘించాయనీ చెబుతున్నారు.