
పైన కనిపిస్తోన్న ఫోటోను చూశారా. ఇప్పుడిది ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది. 2019 నాటి ఈ ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న ఓ జంట తమ శరీరంపై ఉక్రెయిన్, రష్యా జాతీయ జెండాలను కప్పుకున్నారు. 2019లో పోలాండ్‌లో జరిగిన మ్యూజిక్ కన్‌సర్ట్ సమయంలో ఈ దృశ్యం కనిపించింది. ఈ ఫోటోలో ఉన్న మహిళ జులియానా కుజనెత్సోవా తన శరీరంపై రష్యా జెండాను (russia flag) కప్పుకున్నది. ఇక ఆమెతో ఉన్న యువకుడు తన ఒంటిపై ఉక్రెయిన్ జెండాను (Ukrainian flag) కప్పుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) కూడా ఈ ఫోటోను చూసి మురిసిపోయారు. ప్రేమ, శాంతి .. యుద్ధంపై విజయం సాధించాలని ఆశిస్తూ ట్వీట్ చేశారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై భీకర వైమానిక దాడుల మధ్య పెళ్లి ప్రమాణాలతో ఓ జంట ఒక్కటైంది. అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నవారు పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను పిలిచి వివాహం చేసుకున్నారు. ఎప్పుడు ఏమౌతుందో.. అసలు జీవించి ఉంటామో లేదో.. అన్న భయంతో తమ పెళ్లిని యుద్ధం మొదలైన రోజునే చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ జంట. రష్యాలోని వాల్డై హిల్స్‌లో 21ఏళ్ల యారీనా అరివా (Yaryna Arieva) ఆమె భాగస్వామి స్వ్యటోస్లావ్ ఫర్సిన్ (Svyatoslav Fursin) వివాహం చేసుకోవాలని అనుకున్నారు. యువతి యారీనా అరీవా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సిటీ కౌన్సిల్‌లో డిప్యూటీగా పని చేస్తోంది.
పెద్దలు నిశ్చయించిన ప్రకారం.. తన ఫియాన్సీ శివాటోస్లావ్‌తో మే 6న వివాహం జరగాల్సి ఉంది. కానీ. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం యుద్ధం మొదలుకావడంతో ఎక్కడ ఏ బాంబు పడుతుందో? ఎవరు ఎప్పుడు మరణిస్తారోనన్న భయాందోళన నెలకొంది. ఈ బాంబుదాడుల్లో తామిద్దరం చనిపోవచ్చు.. అలా జరగడానికి ముందే పెళ్లిబంధంతో ఒక్కటి కావాలనుకున్నామని యారీనా తెలిపారు. ఓ పక్క బాంబులు పడుతుండటం, బాంబు సైరన్‌లు వినిపిస్తున్న వేళే.. ఈ జంట రింగులు మార్చుకుని ప్రమాణాలతో ఒక్కటైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ (volodymyr zelensky) .. భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధంలో ఒంటరైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఎలాంటి సాయాన్ని ఆశించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, తాము మాత్రం రష్యాను చూసి భయపడట్లేదని, పోరాడుతామని, దేశాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రష్యా దాడికి బెదిరేది లేదంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలొంస్కీ. రష్యా దాడులను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ప్రపంచదేశాలు తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో 10 రష్యా యుద్దవిమానాలను , హెలికాప్టర్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే తాము ఒక్క యుద్ద విమానాన్ని కూడా కోల్పోలేదని ఉక్రెయిన్ అసత్య ప్రచారం చేస్తుందని రష్యా పేర్కొంది.
తాజాగా.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ (Sergey Lavrov) సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం తక్షణమే యుద్దం ఆపాలి. ఉక్రెయిన్ సైన్యం తన చేతుల్లోని ఉన్న ఆయుధాలను వదిలేయాలి. ఆపై రష్యా సైన్యానికి లొంగిపోవాలి. ఉక్రెయిన్ సైన్యం మొత్తం రష్యా సైన్యానికి లొంగిపోయాలి. ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. మరి ఈ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎలా స్పందిస్తారో చూడాలి.