ఇండోనేషియా ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 174కు చేరిన మృతుల సంఖ్య..

By Sumanth KanukulaFirst Published Oct 2, 2022, 3:10 PM IST
Highlights

ఇండోనేషియాలోని తూర్పు జావాలోని ఫుట్‌బాట్‌లో చోటుచేసుకున్న ఘటనలో మృతుల సంఖ్య 174కు చేరింది. ఈ ఘటనలో గాయపడినవారు 100 మందికి పైగా ఉన్నట్టుగా అక్కడి అధికారులు వెల్లడించారు.

ఇండోనేషియాలోని తూర్పు జావాలోని ఫుట్‌బాట్‌లో చోటుచేసుకున్న ఘటనలో మృతుల సంఖ్య 174కు చేరింది. ఈ ఘటనలో గాయపడినవారు 100 మందికి పైగా ఉన్నట్టుగా అక్కడి అధికారులు వెల్లడించారు.  ‘‘ఉదయం 9:30 గంటలకు మరణించిన వారి సంఖ్య 158కి చేరింది. ఉదయం 10:30 గంటలకు ఈ సంఖ్య 174కు పెరిగింది. తూర్పు జావా విపత్తు ఉపశమన సంస్థ సేకరించిన డేటా ఇది’’అని ఈస్ట్ జావా డిప్యూటీ గవర్నర్ ఎమిల్ దార్దాక్ ఆదివారం స్థానిక మీడియాకు తెలిపారు. ఇక, ఈ ఘటనపై విచారణ జరిగే వరకు ఇండోనేషియా టాప్ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లను తప్పనిసరిగా నిలిపివేయాలని అధ్యక్షుడు జోకో విడోడో ఆదేశించారు.

ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్ లోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి పుట్ బాల్ మ్యాచ్ జరిగింది. పెర్సెబయా సురబయా చేతిలో అరేమా ఫుట్‌బాల్ క్లబ్ 3-2 తేడాతో ఓడిపోయింది. అయితే ఈ రెండు జట్లు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓవైపు ఓడిన జట్టు అభిమానులు అసహనం.. మరోవైపు గెలిచిన జట్టు అభిమానుల సంబరాల నేపథ్యంలో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కంజురుహాన్ స్టేడియం అరేమా జట్టుకు హోం గ్రౌండ్ కావడంతో.. డజన్ల కొద్దీ అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.  దీంతో అక్కడివారు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అభిమానులు మైదానం బయటకు వెళ్లేందుకు ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానులు పెద్ద ఎత్తున ఎగ్జిట్ గేట్ల వైపుకు చేరుకోవడంతో అక్కడ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

ఇక, అభిమానుల మధ్య జరుగుతున్న ఘర్షణ, తొక్కిసలాటను నియంత్రించేందుకు స్థానిక పోలీసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆందోళనలను నియంత్రించే క్రమంలో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు చాలా భయానకంగా ఉన్నాయి.

ఈ ఘటన అనంతం స్టేడియం బయట పోలీసుల వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఇప్పటివరకు 13 వాహనాలకు ఆందోళకారులు నిప్పు పెట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టుగా  ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది. ఈ సంఘటన ‘‘ఇండోనేషియా ఫుట్‌బాల్ ముఖాన్ని మసకబార్చింది’’ అని పేర్కొంది. అయితే ఇండోనేషియాలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో హింస కొత్తది కాదు. అరేమా ఎఫ్‌సీ, పెర్సెబయా సురబయా జట్లు చిరకాల ప్రత్యర్థులు. అయితే ఘర్షణలకు భయపడి ఆట కోసం టిక్కెట్లు కొనుగోలు చేయకుండా పెర్సెబయా సురబయ అభిమానులను నిషేధించారు.

ఇదిలా ఉంటే.. 38,000 కెపాసిటీ ఉన్న కంజురుహాన్ స్టేడియంలో మ్యాచ్ కోసం 42,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని చీఫ్ సెక్యూరిటీ మినిస్టర్ మహ్ఫుద్ ఎండీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
 

click me!