
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)లో పరిస్థితులు సున్నితంగా మారుతున్నాయి. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అనేలా ఉన్నాయి. కొంత కాలంగా రష్యా(Russia) నుంచి ఉక్రెయిన్‌కు ముప్పు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, నేడు అది పరాకాష్టకు చేరుతున్నది. యుద్ధ(War) వాతావరణం నెలకొంటున్నది. ఇప్పటికే తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లోకి రష్యా సేనలు(Military) ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ(Indian Embassy) అక్కడ చదువుకుంటున్న భారత విద్యార్థులకు(Indian Students) హెచ్చరికలు జారీ చేసింది. మరెంత మాత్రం ఆలస్యం చేయకుండా.. యూనివర్సిటీల నుంచి సమాచారం కోసం ఎదురుచూడకుండా వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లాలని సూచించింది.
ఫిబ్రవరి 22వ తేదీన ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ విడుదల చేసింది. ఇండియా ఎంబసీకి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మెడికల్ యూనివర్సిటీలు ఆన్‌లైన్ క్లాసులను అందిస్తారా? అనే విషయాన్ని కన్ఫామ్ చేయాల్సిందిగా భారత విద్యార్థులు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపింది. దీనికి సంబంధించి ఇది వరకే చెప్పినట్టుగా భారత విద్యార్థులకు మెడికల్ యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లో క్లాసులు అందించాలనే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఈ సంప్రదింపులు ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపింది. కాబట్టి, మెడికల్ యూనివర్సిటీల నుంచి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురుచూడకుండా భారతీయ విద్యార్థులు వెంటనే ఉక్రెయిన్‌ను వదిలి తాత్కాలికంగా వెళ్లిపోవాలని చెప్పింది.
ఇలా భారతీయులను స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఉక్రెయిన్‌లోని భారత దౌత్య కార్యాలయం సూచనలు చేయడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 20వ తేదీ, ఫిబ్రవరి 15వ తేదీల్లోనూ ఇలాంటి అడ్వైజరీలను జారీ చేసింది.
ఫిబ్రవరి 15వ తేదీన ఇండియన్ ఎంబసీ ఈ విధంగా అడ్వైజరీ విడుదల చేసింది. ఉక్రెయిన్ దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని, వీటి దృష్టిలో పెట్టుకుని ఆ దేశంలోని భారత పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ పిలుపు ఇచ్చింది. తాత్కాలికంగా ఆ దేశం విడిచి వచ్చేయాలని తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌లోనే ఉండక తప్పని పరిస్థితి ఉన్న పౌరులు తమ ఉనికిని ఎప్పటికప్పుడు ఎంబస్సీకి సమాచారం ఇవ్వాలని వివరించింది. ఉక్రెయిన్‌లో వారు ఎక్కడ ఉంటున్నారో సమాచారం ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అవసరమైనప్పుడు ఎంబసీ వారిని అనుసంధానంలోకి తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికైతే.. ఉక్రెయిన్‌లోని భారత ఎంబస్సీ పౌరులకు అన్ని సేవలను అందిస్తున్నదని వివరించింది.
రష్యా ప్రభుత్వం నిన్న కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ తూర్పు భాగంలో దొంబాస్ రీజియన్ ఉన్నది. ఈ రీజియన్‌లోని డొనెత్స్క్, లుహన్స్క్‌లలో వేర్పాటువాదులు ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో రష్యా మద్దతు ఉన్న(!) వేర్పాటువాదులతో నిండి ఉన్నది. ఇక్కడ ఉక్రెయిన్ ప్రభుత్వ పాలన సాగడం లేదు. అయితే, ఈ రెండు ప్రాంతాలను రష్యా ప్రభుత్వం నిన్న స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించింది. వాటిని దొనెత్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లుగా గుర్తించింది. ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా రష్యా గుర్తించిన తర్వాత అక్కడకు తమ మిలిటరీని పంపింది. శాంతి భద్రతలను కాపాడటానికి తాము ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని రష్యా పేర్కొంది.