
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే ఏర్పాట్లను భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే విద్యార్థులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వారిన ఉక్రెయిన్ సరిహద్దులు దాటించి.. రొమేనియా, హంగేరిలకు తరలిస్తుంది. ఆ దేశాలకు చేరుకన్న వారిని ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తీసుకొస్తుంది. అయితే ఇప్పటికి చాలా మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా తూర్పు ప్రాంతాల్లో ఉండేవారి పరిస్థితి దారుణంగా ఉంది.
చాలా మంది భారతీయులు బంకర్లు, మెట్రో స్టేషన్లలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో కాలం గడుపుతున్నారు. కొందరు సరిహద్దుల వరకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా సరే ఉక్రెయిన్ సరిహద్దులు దాటి వెళ్లాలని కొందరు విద్యార్థులు గడ్డకట్టే చలిలో పొలాండ్, రొమేనియా సరిహద్దు ప్రాంతం వద్ద నిరీక్షిస్తున్నారు. చాలా మంది ఉక్రెయిన్ ప్రజలు కూడా దేశాన్ని విడిచిపెట్టి సరిహద్దు దేశాలకు వెళుతున్నారు.
అయితే భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మాత్రం తన పెంపుడు కుక్క లేకుండా ఉక్రెయిన్ నుంచి తిరిగిరానని చెబుతున్నాడు. తాను ఉక్రెయిన్‌ను వీడితే పెంపుడు కుక్కతోనే అని తెలిపారు. వివరాలు.. రిషబ్ కౌశిక్ అనే విద్యార్థి తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రేడియో ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతనికి మాలిబూ అనే పెంపుడు కుక్క ఉంది. అయితే పెంపెడు కుక్క లేకుండా ఉక్రెయిన్ విడిచిపెట్టేందుకు అతడు నిరాకరించాడు.
తాను ఖార్కివ్‌లో ఉన్నానని అయితే.. అదృష్టవశాత్తూ గురువారం ఉదయం మాలిబూతో కలిసి దేశ రాజధాని కీవ్ బయలుదేరాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తనతో పాటు కుక్కను కూడా విమానంలో భారత్‌కు తీసుకెళ్లేందుకు అవసరమైన పత్రాలను, అనుమతులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. అయితే తాను వాటిని పొందలేకపోవతున్నానని తెలిపారు. అధికారులు తన విమాన టికెట్ అడుగుతున్నారని.. ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినప్పుడు తాను విమాన టికెట్ ఎలా పొందగలుగుతానని ప్రశ్నిస్తున్నాడు.
ఈ మేరకు సోషల్ మీడియాలో అతడు ఓ వీడియో అప్‌లోడ్ చేశాడు. తన పెంపుడు కుక్క తరలింపుకు సంబంధించి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించానని.. అయితే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని కౌశిక్ చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయానికి కాల్ చేస్తే.. అవతలి వ్యక్తితో తనపై దుర్భాషలాడాడని చెప్పుకొచ్చారు.
తాను ప్రస్తుతం కీవ్‌లోని బంకర్‌లో తలదాచుకున్నానని చెప్పాడు. గత ఫిబ్రవరిలో తన వద్దకు మాలిబు వచ్చిందని.. స్థానికంగా ఉండే వ్యక్తి దాన్ని రెస్క్యూ చేసిన అప్పగించాడని తెలిపాడు. కౌశిక్ షేర్ చేసిన వీడియోలో తన పెంపుడు కుక్కను చూపించాడు. బాంబులు వల్ల వస్తున్న శబ్దాలతో మాలిబు తీవ్ర ఒత్తిడికి గురవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు వీలైతే సాయం చేయాలని కోరాడు. భారత రాయబార కార్యాలయం నుంచి సహాయం అందడం లేదని.. ఎటువంటి అప్‌డేట్స్ అందించడం లేదని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.