
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్‌ను పూర్తిగా దురాక్రమించాలనే దురాలోచనలో రష్యా ఉన్నదని పశ్చిమ దేశాలు ఆరోపణలు చేశాయి. మరోవైపు రష్యాను నిలువరించాలని ఉక్రెయిన్ కోరుతూనే రష్యాపై ప్రతిదాడులకు పూనుకున్నది. రష్యా కూడా తాము ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలనే ఆలోచనలు చేయడం లేదని స్పష్టం చేసింది. అసలు ఇది యుద్ధమే కాదని, కేవలం సైనిక చర్య మాత్రమేనని చెప్పుకుంటున్నది. తాము ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, దొంబాస్ రీజియన్‌లోని డీపీఆర్, ఎల్‌పీఆర్‌ల రక్షణ కోసమే తాము ఈ మిలిటరీ ఆపరేషన్(Military Operation) చేపడుతున్నామని చెప్పింది. అంతేకాదు, ఇటీవలే.. మరో ఆరోపణ కూడా చేసింది. ఉక్రెయిన్ చర్చలు జరపడానికి సిద్ధంగా లేదని, ఈ ఘర్షణలను పొడిగించాలనే భావిస్తున్నదని మండిపడింది.
సైనిక చర్య ప్రారంభానికి ముందూ చర్చలు జరపాలని, ఆ దారిలోనే ఉద్రిక్తతలు సమసిపోవడానికి కృషి చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. తాము చర్చలకు సిద్ధం అని, చర్చలకు లొకేషన్‌ను రష్యాకే విడిచిపెడుతున్నామని కూడా పేర్కొన్నారు. తాజాగా, ఈ సంక్షోభంపై చర్చించడానికి రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే చర్చలకు వేదికగా దాని మిత్ర దేశం బెలారస్‌ను వేదికగా సూచించింది. బెలారస్(Belarus)లోని గోమెల్‌లో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. కానీ, ఈ ఆఫర్‌ను ఉక్రెయిన్ తిరస్కరించింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పూర్వం బెలారస్‌లో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. అక్కడి నుంచీ ఉక్రెయిన్‌పై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై దాడులకుగా వేదిగా ఉన్న బెలారస్‌లో శాంతి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా లేని ఉక్రెయిన్ చెబుతున్నది.
రష్యాతో తమకు నిజమైన చర్చలు అవసరం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ సలహాదారు వెల్లడించారు. రష్యా మిలిటరీ దాడులపై ఎలాంటి అల్టిమేటమ్‌లు లేకుండా చర్చలు జరగాలని, కానీ, ఇప్పుడు రష్యా ఇచ్చిన శాంతి చర్చల ఆఫర్ కేవలం ప్రాపగండ మాత్రమేనని కొట్టిపారేశారు. ఉక్రెయిన్‌పై అభిప్రాయాలను తప్పుదారి పట్టించాలనే రష్యా ఈ ప్రకటన చేసిందని ఆరోపించారు. బెలారస్‌లో చర్చల కోసం తమ ప్రతినిధులను పంపించామని, ఉక్రెయిన్ అధికారుల కోసం ఎదురుచూస్తున్నామని రష్యా చెప్పడం కేవలం దుష్ప్రచారం కోసమేనని అన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ కూడా ఈ శాంతి చర్చల ప్రతిపాదనపై స్పందించారు. తమ దేశం రష్యాతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నదని, కాని, వాటిని బెలారస్‌లో జరపడానికి అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై మూడు రోజులుగా జరుగుతున్న దాడుల్లో బెలారస్ కూడా భాగస్వామ్యం పంచుకున్నదని పేర్కొన్నారు. బెలారస్‌లోని గోమెల్‌కు బదులుగా వార్సా, బ్రాటిస్లావా, ఇస్తాంబుల్, బుడాపెస్ట్, బాకు వంటి నగరాలను ప్రత్యామ్నాయ వేదికలుగా తీసుకుని, అక్కడ చర్చలు జరపాలని సూచించారు. రష్యా సూచించిన బెలారస్‌లో చర్చలను ఉక్రెయిన్ అంగీకరించబోదని, మరే నగరంలోనైనా చర్చలకు సిద్ధమేనని వివరించారు.
బెలారస్‌లోని మిన్స్క్ నగరంలోనే ఇది వరకు మిన్స్క్ ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే. 2014లో, 2015లో రెండు మిన్స్క్ ఒప్పందాలు కుదిరాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు స్వాతంత్ర్యం కోసం ఆ దేశంలో తిరుగుబాటు చేశాయి. ఆ తిరుగుబాటుదారులకు రష్యా అండ ఉన్నదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ తిరుగుబాటుదారులకు, ఉక్రెయిన్ సైన్యానికి నిత్యం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల విరమణ కోసమే మిన్స్క్‌లోరష్యా, ఉక్రెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ పర్యవేక్షణలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందం తర్వాత వేర్పాటువాద ప్రాంతాలు డీపీఆర్, ఎల్‌పీఆర్‌లుగా గుర్తించుకున్నాయి. ఈ ఒప్పందాలపై ఉక్రెయిన్‌కు అసంతృప్తి ఉన్నది. అందుకే, ఎలాంటి ఒత్తిళ్లు లేని విధంగా.. రష్యా అనుకూల దేశంలో కాకుండా ఈ సంక్షోభంతో సంబంధం లేని ఇతర దేశాల్లో శాంతి చర్చలు జరగాలని ఉక్రెయిన్ చెబుతున్నది. అందుకే రష్యా శాంతి చర్చల ప్రతిపాదనలోని ఒక అంశాన్నీ మాత్రమే తోసిపుచ్చింది. కానీ, శాంతి చర్చలను వద్దనలేదు.