దేశంకాని దేశం అమెరికాకు ఉన్నత విద్యకోసం వెళ్లిన ఓ యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు.
అమెరికా : ఎన్నో కలలతో విదేశాలకు వెళ్లాడా యువకుడు. కానీ ఇంతలోనే అతడి ఆశలన్నీ ఆవిరయ్యాయి. దేశంకాని దేశంలో కాల్పులకు గురయిన భారతీయ యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని న్యూడిల్లీలోని ఎయిమ్స్ నుండి ఫిజియాలజీలో మాస్టర్స్ పూర్తిచేసాడు ఆదిత్య. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన అతడు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ యూనివర్సిటీలో పిహెచ్ డి చేస్తున్నాడు.
undefined
వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారులో వెళుతున్న ఆదిత్య నవంబర్ 9న కాల్పులకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు ఆదిత్యపై కాల్పులకు తెగబడటంతో కారు అదుపుతప్పి ఓ గోడను డీకొట్టింది. దీంతో ప్రాణాపాయస్థితిలో వున్న ఆదిత్యను హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదిత్య మృతిచెందినట్లు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి ప్రకటించింది.
ఆదిత్య మృతితో ఇండియాలోని అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. తమ కొడుకు ప్రయోజకుడిగా తిరిగివస్తాడనుకుంటే ఇలా విగతజీవిగా చూడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ మృతదేహం తొందరగా ఇండియాకు చేరుకునేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం కోరుతోంది.
అయితే ఆదిత్య హత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. అతడి కారు అద్దాలకు మూడు బుల్లెట్ రంధ్రాలు వున్నట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు.