మనల్ని పాలించిన బ్రిటన్‌ను పరిపాలించనున్న భారత సంతతి ప్రధాని? యూకే పీఎం రేసులో రిషి సునాక్!

Published : Jul 07, 2022, 03:26 PM ISTUpdated : Jul 07, 2022, 03:36 PM IST
మనల్ని పాలించిన బ్రిటన్‌ను పరిపాలించనున్న భారత సంతతి ప్రధాని? యూకే పీఎం రేసులో రిషి సునాక్!

సారాంశం

భారత మూలాలు ఉన్న రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడానికి అంగీకరించారు. దీంతో పార్టీ లీడర్షిప్ రేసులో రిషి సునాక్ ఫేవరేట్‌గా ఉండబోతున్నారు. ఈ రేసులో నెగ్గితే అక్టోబర్‌లో రిషి సునాక్ యూకే కొత్త పీఎంగా బాధ్యతలు తీసుకుంటారు. అక్టోబర్ వరకు ఆపద్ధర్మ పీఎంగా బోరిస్ జాన్సన్ కొనసాగుతారు.  

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడానికి అంగీకరించారు. ఈ రోజు సాయంత్రానికల్లా రాజీనీమా చేయబోతున్నట్టు బీబీసీ ఓ కథనంలో వెల్లడించింది. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానిగా కొనసాగడం సముచితం కాదని టోరీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన వెంటనే ప్రధానిగా దిగిపోవాలని డిమాండ్ చేస్తూ 50కిపైగా మంత్రులు, పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. తొలుత తాను ప్రధానిగా దిగిపోయేదే లేదని, అవసరమైతే పోరాడుతానని చెప్పిన బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారు. ఈయన రాజీనామాతో కొత్త యూకే పీఎం ఎవరా? అనే చర్చ మొదలైంది.

భారత సంతతి రిషి సునాక్ తదుపరి యూకే పీఎం రేసులో ఉన్నారు. ఒక వేళ ఆయనే ప్రధాని పదవిని సాధిస్తే.. సుమారు 200 సంవత్సరాలపాటు మన దేశాన్ని పాలించిన బ్రిటీష్‌ వారిని పాలించే అవకాశం వస్తుంది. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు తీసుకునే తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రలో నిలుస్తారు. అయితే, కొత్త యూకే పీఎం అక్టోబర్‌లో బాధ్యతలు తీసుకుంటారు.

బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారు. అలాగే, కన్జర్వేటివ్ పార్టీ లీడర్ పోస్టు నుంచీ దిగిపోతున్నారు. కొత్త ప్రధాని ఎంపిక కోసం.. ముందుగా కన్జర్వేటివ్ పార్టీ లీడర్ ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఈ రేసులో ఆర్థిక మంత్రిగా రాజీనామా చేసిన రిషి సునాక్, ఆరోగ్య మంత్రిగా రాజీనామా చేసిన సాజిద్ జావిద్‌లు నిలవబోతున్నారు. వీరిద్దరూ ఈ రేసులో ఫేవరేట్‌గా మారబోతున్నట్టు ది గార్డియన్ పేర్కొంది. ఈ రేసులో రిషి సునాక్ నెగ్గితే.. అక్టోబర్‌లో ఆయన యూకే కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారు.

భారత సంతతి రిషి సునాక్ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయగానే.. ఇతర బ్రిటన్ మంత్రుల రాజీనామాలు వచ్చి పడ్డాయి. 42 ఏళ్ల రిషి సునాక్‌ను బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. 2020 ఫిబ్రవరిలో స్వయంగా బోరిస్ జాన్సన్.. సునాక్‌ను ఎంచుకున్నారు. బోరిస్ జాన్సన్ సంక్షోభం ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో రిషి సునాక్‌ ఆయన వెంటే నిలబడ్డాడు.

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు అష్టకష్టాలు పడుతుండగా.. పదుల బిలియన్ల పౌండ్ల ప్యాకేజీతో రిషి  సునాక్ ప్రజలను మెప్పించారు. అప్పటి నుంచి చాలా మందికి ఫేవరేట్‌గా మారారు.

రిషి సునాక్ మూలాలు మన దేశం పంజాబ్‌లో ఉన్నాయి. ఆయన తాత, అమ్మ ఇక్కడి వారే. కాలిఫోర్నియాలో చదువుతుండగా రిషి సునాక్‌.. ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎణ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.  వారికి ఇద్దరి కుమార్తెలు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !