హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను తోసిపుచ్చిన భారత్.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రం

By Asianet News  |  First Published Sep 19, 2023, 8:51 AM IST

గతేడాది జూన్ లో ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే దీంట్లో భారత్ ప్రమేయం ఉందని కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని తెలిపారు. దీనిని భారత్ ఖండించింది.


ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతికి భారత్ కు సంబంధం ఉందని కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ లో ఆరోపణలు చేశారు. అయితే దీనికి భారత్ మంగళవారం ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ కెనడా ప్రధాని తమ పార్లమెంటులో చేసిన ప్రకటనను, అలాగే వారి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను మేము చూశాము దానిని తిరస్కరిస్తున్నాము.’’ అని పేర్కొంది. 

కెనడాలో జరిగిన ఏ హింసాత్మక చర్యకైనా భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని, ఈ విషయంలో కెనాడా ప్రధాని చేసిన ఆరోపణలు అసంబద్ధం, ప్రేరేపితమని ఎంఈఏ పేర్కొంది. ఇలాంటి ఆరోపణలను కెనడా ప్రధాని మన ప్రధానికి చేయగా, వాటిని ఆయన పూర్తిగా తోసిపుచ్చారని తెలిపింది. తమది చట్టపాలన పట్ల బలమైన నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థ అని పేర్కొంది. 

Latest Videos

‘‘కెనడాలో ఆశ్రయం కల్పించి, భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా పరిణమించిన ఖలిస్తానీ తీవ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో కెనడా ప్రభుత్వ నిష్క్రియాపరత్వం దీర్ఘకాలిక మరియు నిరంతర ఆందోళనగా ఉంది.’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

‘‘ఇలాంటి శక్తుల పట్ల కెనడా రాజకీయ ప్రముఖులు బాహాటంగానే సానుభూతి వ్యక్తం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమే.
హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలతో సహా అనేక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కెనడాలో చోటు కల్పించడం కొత్తేమీ కాదు.
ఇలాంటి పరిణామాలతో భారత ప్రభుత్వాన్ని ముడిపెట్టే ప్రయత్నాలను మేము తిరస్కరిస్తాము. తమ గడ్డపై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న భారత వ్యతిరేక శక్తులపై తక్షణమే, సమర్థవంతమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’’ అని తెలిపింది. 

ఇంతకీ కెనడా ప్రధాని ఏం అన్నారంటే ? 
సోమవారం కెనడా పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. ఇందులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. గతేడాది జూన్ లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను భారత ప్రభుత్వ ఏజెంట్లతో ముడిపెట్టారు. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి విశ్వసనీయమైన సమచారం ఉందని తెలిపారు.‘‘భారత ప్రభుత్వ ఏజెంట్లకు, కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు మధ్య సంబంధం ఉందనే విశ్వసనీయ ఆరోపణలను కెనడా భద్రతా సంస్థలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. 

తమ ప్రభుత్వం తన ఆందోళనను భారత భద్రత, ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేసిందని ట్రూడో చెప్పారు. ఈ నెలలో జీ-20 కోసం భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై చర్చించినట్లు ఆయన గుర్తు చేశారు. ‘‘కెనడా గడ్డపై, కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వం ప్రమేయం ఉండటం మన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. స్వేచ్ఛాయుత, బహిరంగ, ప్రజాస్వామిక సమాజాలు తమను తాము నిర్వహించుకునే ప్రాథమిక నియమాలకు ఇది విరుద్ధం’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ తీవ్రమైన అంశంపై తమ ప్రభుత్వం మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తోందని, భారత్ సహకారాన్ని కూడా కోరినట్లు ట్రూడో తెలిపారు.
 

click me!