కరోనా చికిత్స: హైడ్రోక్సీక్లోరోక్విన్ వల్ల మరణించే వారే ఎక్కువ!

By Sree sFirst Published May 23, 2020, 4:46 AM IST
Highlights

తాజగా జరిపిన పరిశోధనల్లో, కరోనా వైరస్ బారినపడ్డ రోగుల్లో ఈ  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును తీసుకోనివారికన్నా తీసుకున్నవారు ఎక్కువగా మరణించే అవకాశం ఉందన్న చేదు నిజం బయటకు వచ్చింది. ఆరు ఖండాల్లోని దాదాపు 96,000 కరోనా వైరస్ రోగులపైన జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. 

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూ మానవాళిని కబళించి వేస్తున్న వేళ.... మనుషుల ప్రాణాలను రక్షించేందుకు సరైన మందు లేక, డాక్టర్లు అనేక రకాల మందులను రోగులకు ఇస్తూ వారి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా మహమ్మారిపై పోరాడేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఈ వైరస్ బారినపడ్డ వారికి ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా దీన్ని వండర్ డ్రగ్ గ పేర్కొంటూ భారతదేశం నుంచి ఈ మందును తమ దేశానికి కూడా సరఫరా చేపించుకున్నాడు. 

అయితే... తాజగా జరిపిన పరిశోధనల్లో, కరోనా వైరస్ బారినపడ్డ రోగుల్లో ఈ  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును తీసుకోనివారికన్నా తీసుకున్నవారు ఎక్కువగా మరణించే అవకాశం ఉందన్న చేదు నిజం బయటకు వచ్చింది. ఆరు ఖండాల్లోని దాదాపు 96,000 కరోనా వైరస్ రోగులపైన జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. 

ఈ మందు వల్ల కరోనా వైరస్ బారినపడ్డ వారిలో గుండె ప్రతిస్పందించే తీరులో, గుండె కొట్టుకునే వేగంలో, గుండె లయలో మార్పులు రావడం వల్ల హార్ట్ ఎటాక్ తో మనిషి మరణించే ఆస్కారముందని ప్రఖ్యాత లాన్సెట్ హెల్త్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. 

ఇప్పటికే కరోనా వైరస్ చికిత్సకు ఈ మందును వాడడంపై పలువురు శాస్త్రవేత్తలు సైతం అభ్యంతరాలు తెలిపారు. ఈ అధ్యయనం ప్రచురితమయ్యాక మరికొందరు శాస్త్రవేత్తలు, వైద్యులు కూడా ఈ మందు వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇకపోతే... ప్రతి రోజూ తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు వేసుకొంటున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్గ్ ట్రంప్ ప్రకటించారు. గత 10 రోజుల నుండి ఈ మందును తాను క్రమం తప్పకుండా తీసుకొంటున్నట్టుగా చెప్పారు.

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే సుమారు 80 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.

శ్వేత సౌధంలోని వైద్యులు సూచించకపోయినా కూడ తాను మాత్రం ఈ మందులు వాడుతున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ మందులు తాను వాడుతున్న విషయమై వైద్యుడితో చెబితే అతను కూడ అభ్యంతరం తెలపలేదని ట్రంప్ మీడియాకు చెప్పారు.

ప్రతి రోజూ ఒక్క మాత్ర వేసుకొంటున్నానని చెప్పారు. కరోనా నివారణలో ఈ మందును ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ మందు కరోనా రోగుల్లో మంచి ఫలితాలను తెచ్చిందని ఆయన చెప్పారు. అందుకే ఈ మందును ఉపయోగిస్తున్నానని ట్రంప్ స్పష్టం చేశారు.

click me!