ఇమ్రాన్ ఖాన్‌ను చంపడానికే వచ్చా.. ఎందుకంటే: పాక్ మాజీ పీఎంపై కాల్పుల జరిపిన షూటర్ ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Nov 3, 2022, 7:38 PM IST
Highlights

పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన షూటర్ సంచలన విషయాలు చెప్పాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నాడని, కాబట్టి, ఆయనను చంపాడానికి స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొన్నాడు.
 

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో దారుణ ఘటన జరిగింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ప్రధానమంత్రి పీఠాన్ని అర్ధంతరంగా వదిలిపెట్టాల్సి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో పొలిటికల్ ర్యాలీ చేపడుతున్నారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌ వరకు ర్యాలీని శుక్రవారం ప్రారంభించారు. ఈ ర్యాలీ చేపడుతుండగా.. జనం మధ్యలో నుంచి ఓ దుండగుడు మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ ఆయన కాలికి తగలడంతో ప్రాణాలను దక్కించుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన షూటర్‌ ఆన్ రికార్డులో సంచలన విషయాలను అంగీకరించారు.

తాను కేవలం ఇమ్రాన్ ఖాన్‌ను మాత్రమే చంపడానికి వచ్చానని, ఇతరులను గాయపరచాలని తాను అనుకోవడం లేదని షూటర్ ఆన్ కెమెరాలో పేర్కొన్నాడు. ఇది ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నాడు. తాను ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే స్పష్టంగా ఈ నిర్ణయానికి వచ్చే దాడి చేశానని వివరించాడు. తన వెహికిల్‌ను అంకుల్ షాపు దగ్గర వదిలి పెట్టి వచ్చినట్టు తెలిపాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అందుకే ఆయనను చంపాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఇమ్రాన్ ఖాన్ పై దాడి చేయడం వెనుక ఎవరు ఉన్నారని ప్రశ్నించగా.. తన వెనుక ఎవరూ లేరని, ఇది తాను స్వయంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపాడు. ఇంకెవరూ తనతో లేరా? ఒంటరిగానే ఈ దాడికి తెగబడ్డావా? అని అడగ్గా.. తాను ఒక్కడినే ఈ దాడి చేసినట్టు చెప్పాడు.

Also Read: పాకిస్తాన్ వజీరాబాద్ లో కాల్పులు:మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గాయాలు

ఇమ్రాన్ ఖాన్‌పై దాడి చేయడానికి ఇద్దరు షూటర్లు వచ్చినట్టు కొన్ని కథనాలు పేర్కొన్నాయి. ఒకరు పిస్టల్‌తో, మరొకరు ఆటోమేటిక్ రైఫిల్‌తో వచ్చినట్టు తెలిపాయి. 

కాలికి బుల్లెట్ గాయమైన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇది కచ్చితంగా ఇమ్రాన్ ఖాన్‌ను చంపాలనే ప్రయత్నమే అని ఆయన ఆంతరంగికుడు రౌఫ్ హాసన్ తెలిపారు.

click me!