Nepal earthquake : నేపాల్‌లో భారీ భూకంపం : 128 మంది మృతి.. ప్రాణనష్టంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

By Asianet News  |  First Published Nov 4, 2023, 10:06 AM IST

నేపాల్ భూకంపం వల్ల భారీ మరణాలు సంభవించాయి. ఈ ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్ కు భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 


Nepal earthquake :నేపాల్ లో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 128కి చేరింది. ఈ ప్రకంపనల వల్ల పశ్చిమ నేపాల్ లోని జాజర్ కోట్, రుకుమ్ జిల్లాల్లో 140 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘నేపాల్ టెలివిజన్’ తెలిపింది.  జాజర్ కోట్ లోని లామిదాండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కొలతల కేంద్రం అధికారులు తెలిపారు.

కాగా..  భూకంపం కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్ లో సంభవించిన భూకంపం కారణంగా భారీగా మరణాలు సంభవించడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Latest Videos

undefined

ఇదిలా ఉండగా.. భూకంపంలో క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు దేశంలోని మూడు భద్రతా సంస్థలను రంగంలోకి దింపినట్లు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ కార్యాలయం తెలిపింది. ప్రధాని దహల్ ప్రచండ కూడా శనివారం దేశంలోని భూకంప ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. 

ఈ ప్రకంపనల వల్ల దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలతో సహా ఇతర జిల్లాల నుంచి కూడా పలువురు గాయపడ్డారు. అలాగే ఆస్తినష్టం కూడా సంభవించినట్టు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాట్మండుకు పశ్చిమాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజర్ కోట్ లోని ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

హిమాలయ దేశమైన నేపాల్ లో భూకంపాలు సర్వసాధారణంగా వస్తుంటాయి. అక్టోబర్ 3న నేపాల్ లో 6.2 తీవ్రతతో వరుస భూకంపాలు సంభవించగా, ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఏడాది క్రితం 2022 నవంబర్ లో దోతి జిల్లాలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఆరుగురు మరణించారు. దేశాన్ని కుదిపేసిన వరుస భూకంపాల్లో ఇదొకటి. 2015 లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 12,000 మందికి పైగా మరణించారు. 

click me!