
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సీక్రెట్ ఏజెంట్‌గా తన కెరీర్ ప్రారంభించి రష్యా అధ్యక్షుడిగా ఎదిగిన తీరు ఊహించని విధంగా ఉంటుంది. ఆయన ఆలోచనలు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా అల్లుకుని ఉంటాయని ఆయన గురించి చదివితే అర్థం అవుతుంది. తన మిత్రులు ఎప్పుడూ తన కంటే పై పొజిషన్‌లో ఉన్నవారినే ఎంచుకునేవారు. చిన్న చిన్న ప్లాన్‌లతో పెద్ద లక్ష్యాలను సాధించుకునేవారు. అనవసరమైన బాతాఖానీలోనూ ఆయన కనికట్టు చేసేవారని చెబుతున్నారు. వ్లాదిమిర్ పుతిన్ జీవిత చరిత్ర రాసిన మాషా జెసెన్ ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వ్లాదిమిర్ పుతిన్ రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 1952లో సాధారణ కుటుంబంలో జన్మించారు. పుతిన్ తన లా డిగ్రీ పట్టా పొందిన తర్వాత సోవియెట్ సీక్రెట్ పోలీసు విభాగం కేజీబీలో చేరారు. ఆయనను తూర్పు జర్మనీలోని డ్రెస్‌డెన్‌లో ఒక ట్రాన్స్‌లేటర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. జర్మనీలో ఆయనను కేవలం పేపర్ క్లిప్పింగ్‌ల సేకరణ వంటి చాలా చిన్న చిన్న పనులకే పురమాయించారని మాషా జెసెన్ వివరించారు. జర్మనీలో బెర్లిన్ వాల్ కూల్చిన తర్వాత ఆయన తిరిగి రష్యాకు వచ్చారు. 1990 వరకు ఆయన సీక్రెట్ ఏజెన్సీలోనే అధికారిగా కొనసాగారు.
పుతిన్ ఎక్కువగా తన రాజకీయ మిత్రులతో వేగంగా పై పదవులకు ఎదిగినట్టు తెలుస్తున్నది. 1990లో పీటర్స్‌బర్గ్‌లో ఆయన ఆర్థిక నేరం చేసినట్టు ఆరోపణలు ఉన్నా.. దానిపై ఆయన చర్యలు తీసుకోలేకపోయారు. ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఆయనను తొలగించాలని ఆదేశించినా.. 1996 వరకు తన పొజిషన్ భద్రంగా కొనసాగింది. ఎందుకంటే.. అప్పటికే ఆయనకు మేయర్ అనటోలీ సోబ్‌చాక్‌తో దగ్గరి స్నేహం ఉన్నది. అందుకే ఆయన చేసే ప్రతి పనిలో, చేసే ప్రతి ఆలోచనలో ఆయనకు ప్లాన్ బీ కచ్చితంగా ఉంటుందని చర్చిస్తుంటారు.
రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్న నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు పెట్టుకునేవారు. ఈ క్రమంలోనే 1997లో ఆయనకు బంపరాఫర్ వచ్చింది. అప్పటి ప్రెసిడెంట్ బోరిస్ ఎల్ట్‌సిన్.. పుతిన్‌న తన డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత ఒక ఏడాదికి కేజీబీకి చీఫ్‌గా నియమించాడు. ఆ తర్వాత ఏకంగా ఆయనను ప్రధానిగా నియమించుకున్నాడు. ఎల్ట్‌సిన్ స్నేహితులు, ప్రత్యర్థులు పీఎం సీటు కోసం ఎంతో ప్రయత్నించినా.. పుతిన్ చాకచక్యంగా తాను పొందారని చెప్పుకుంటారు. తద్వార ప్రెసిడెంట్ పదవికి ఒక్క అడుగు చెంతకు చేరారు. అయితే, 1999లో ఎల్ట్‌సిన్ అనుకోకుడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు పుతిన్ యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన చేసిన తొలి పని ఏమంటే.. తన మిత్రుడు ఎల్ట్‌సిన్‌పై ఉన్న ఆర్థిక నేరాలన్నింటిలో క్షమాభిక్ష పెట్టారు. అప్పటికే తాను ప్రెసిడెంట్‌గా పదోన్నతి కావడానికి అన్ని చక్కబెట్టుకున్నారు.
అయితే, పుతిన్ రెండో చెచెన్ వార్‌లో ప్రజల ఆదరణను చూరగొన్నారు. దీనితో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం సులవైంది. ఆయన అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తర్వాత దేశ ఆర్థిక స్థితిని బాగు చేశారు. అంతకు ముందు ఉన్న ప్రెసిడెంట్ ఎప్పుడూ తాగుతుంటారని, చపలత్వం అని చాలా మంది ఆడిపోసుకున్నారు. కానీ, పుతిన్ అధ్యక్షుడు అయ్యాక సొంత ఇమేజ్‌తోపాటు దేశ ఇమేజ్‌ను కూడా మార్చేశారు. అప్పటి నుంచి ఆయన అధికారంలోనే కొనసాగారు. ఇప్పటి వరకు ఒకసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అది మినహా అప్పటి నుంచి అధ్యక్షుడిగానే కొనసాగారు.
పుతిన్ దగ్గర మరో కనికట్టు ఉన్నది. పిచ్చాపాటిగా మాట్లాడటం. అసలు అందుకు అర్థమే లేదని తెలిసి కూడా అనవసర అంశాలపైనా మాట్లాడుతూ ఫలానా దాంట్లో తానే నిపుణులు అన్నట్టుగా చెబుతుంటారని జెసెన్ తెలిపారు. అందులోనూ తనకు లోతైన అవగాహన కలదని, తనకు అన్నీ తెలుసు అని ముద్ర వేయడం సహజమని వివరించారు.