
న్యూఢిల్లీ: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు మనిషి రోదసిలోకి పంపిన ఉన్నత ప్రమాణాలు గల టెలిస్కోప్ ఇదే. అందుకే ఈ టెలిస్కోప్ పంపే చిత్రాలు అనేక విశ్వ, ఖగోళ రహస్యాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బిగ్ బ్యాంగ్ (విశ్వం పుట్టుక) సంభవించిన తర్వాత స్వల్ప కాలంలోనే ఏర్పడ్డ గెలాక్సీల గురించిన చిత్రాలను ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ బంధించనుంది. వాటినే నేడు సాయంత్రం 5 గంటలకు (2100 జీఎంటీ) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడుదల చేయనున్నారు. లైవ్ స్ట్రీమ్ ఈవెంట్‌లో ఆయన ఈ చిత్రాలను విడుదల చేస్తారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ బంధించిన హై రిజల్యూషన్ చిత్రాలు.. 13 బిలియన్ (ఒక బిలియన్ వంద సంవత్సరాలకు సమానం) సంవత్సరాలకు పైబడిన వయసు గల గెలాక్సీల నుంచి విడుదలైన కాంతిని చూపించనున్నట్టు వైట్ హౌజ్ ప్రతినిధి కరైన్ జీన్ పియర్ వివరించారు.
ఇదీ ప్రత్యేకత:
ఇతర టెలిస్కోప్‌లతో పోలిస్తే.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎన్నో విధాల ఉన్నత ప్రమాణాలు గలది. ముఖ్యంగా ఇది ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను బంధించే సామర్థ్యం దీన్ని ఎంతో ప్రత్యేకంగా నిలుపుతున్నది. విశ్వం నిరంతరం వ్యాకోచిస్తూనే ఉన్నది. ఈ క్రమంలో నక్షత్రాలు వేల కాంతి సంవత్సరాల దూరానికి తరలిపోయాయి. ఈ క్రమంలో వాటి నుంచి వెలువడే కాంతి సాధారణ రూపంలో సౌర వ్యవస్థను చేరడం అసాధ్యం. అయితే, ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను కూడా పట్టుకోగలిగితే.. వాటి వివరాలను కనుగొనే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, దూరం పెరగడం మూలంగా మధ్యలో ఎన్నో ఖగోళ ధూళి మేఘాలు, మరెన్నో అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు వీటన్నింటినీ చీల్చుతూ ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి, ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను బంధించడం అనే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సామర్థ్యం విశ్వ రహస్యాలను ఛేదించడంలో ఎంతో గొప్ప అడుగు వేయడానికి ఉపకరిస్తున్నది.
ఈ సామర్థ్యం కారణంగా ఇది వరకు ఏ టెలిస్కోప్ కూడా కనిపెట్టని రీతిలో 1380 కోట్ల సంవత్సరాలకు పూర్వం నాటి విశ్వ పరిస్థితులను మరో విధంగా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ ఏర్పడ్డ స్వల్ప కాలం తర్వాత పరిస్థితులను పరిశీలించడానికి వీలు చిక్కుతున్నది.
రహస్యాల ఛేదన ఎలా?
ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులను ఇప్పుడు ఎలా వీక్షించగలమనే లేదా పరిశీలించగలమనే అనుమానాలు రావచ్చు. దీనికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. సూర్యుడి నుంచి భూమిపైకి కాంతి చేరడానికి సుమారు 8 నిమిషాల సమయం పడుతుంది. అంటే.. మనం ఇప్పుడు చూస్తున్న సూర్యుడు నిజానికి ఎనిమిది నిమిషాల సమయం క్రితం సూర్యుడని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. విశ్వంలో కొన్ని వేల కాంతి సంవత్సరాల (ఒక కాంతి సంవత్సరం అంటే.. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం) దూరంలో విడుదలైన కాంతి కిరణం ఇప్పుడు మనం బంధిస్తున్నామంటే.. అంటే అన్ని వేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులను తెలుసుకోవడానికి అవకాశమున్న సమాచారం ఆ కాంతిలో ఉండొచ్చు. అంటే.. ఎంత దూరంలోని గెలాక్సీల నుంచి విడుదలైన కాంతిని పడితే.. దానికి అనులోమానుపాతంలోనే అంతటి పురాతనమైన విషయాలను మనం పరిశీలించగలం. వేల కాంతి సంవత్సరాల దూరంలోని ఓ నక్షత్రం నుంచి విడుదలైన ఆ కాంతి కిరణం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే.. అన్నే వేల సంత్సరాలు ప్రయాణించి ఇక్కడకు చేరినట్టుగా గుర్తించాలి. అంతటి పురాతన కాంతి కిరణాన్ని బంధిస్తే.. అన్నే వేల కోట్ల సంవత్సరాల నాటి పరిస్థితులను పరిశీలించడానికి ఆస్కారం కలుగుతుంది.
ఫస్ట్ వేవ్ ఇమేజెస్‌లో 7,600 కాంతి సంవత్సరాల దూరంలోని గ్యాస్ (కారినా నెబ్యూలా సహా) చిత్రాలు ఉంటాయని ఇంటర్నేషనల్ కమిటీ డిసైడ్ చేసింది. అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి కారినా నెబ్యూలా గురించి తెలిసే ఉంటుంది. ఈ నెబ్యూలాలో విచిత్రంగా పర్వతాల్లాగా కనిపించే అమరికలు ఉంటాయి.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎక్కడ ఉన్నది?
ఇంతకీ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎక్కడ ఉన్నదో పరిశీలిద్దాం. గతేడాది డిసెంబర్‌లో ఫ్రెంచ్ గయానా నుంచి ఈ టెలిస్కోప్ ను రోదసిలోకి పంపారు. భూమి నుంచి 1.6 మిలియన్ కిలో మీటర్ల దూరంలో భూమికి, సూర్యునికి మధ్య గల సెకండ్ లెగ్రాంజ్ పాయింట్ వద్ద ఈ టెలిస్కోప్‌ను ఉంచారు. సూర్యుడు, భూమితో పోలిస్తే.. ఈ టెలిస్కోప్ ఫిక్స్‌డ్ పొజిషన్‌లో ఉంటుంది. ఈ టెలిస్కోప్ కూడా దానికి అదిగా ఏదైనా మార్చుకోవాలనుకున్నా తక్కువ ఇంధనం అవసరం పడుతుంది. ఈ టెలిస్కోప్ 20 ఏళ్లు పని చేయడానికి సరిపడా ఇంధనం ఉన్నది. ఈ టెలిస్కోప్ నిర్దేశితక కక్ష్య భూమి నుంచి చాలా దూరం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌లో ఏదైనా మార్పు చేయాలన్న అక్కడికి వ్యోమగాములు వెళ్లి చేసే పరిస్థితి లేదు. కాబట్టి, నాసా ఈ టెలిస్కోప్ కోసం ఎన్నో సంవత్సరాలు శ్రమ, వ్యయప్రయాసలకు ఓర్చి విజయవంతంగా ప్రయోగించింది. ఈ టెలిస్కోప్ విశ్వ రహస్యాలను కనుక్కోవడంలో అందివచ్చిన అద్భుత టూల్‌గా పేర్కొంటున్నారు.