ట్రంప్ పాలనలో పెరిగిన పేదరికం, అసమానత: ఐరాస!

First Published Jun 25, 2018, 11:51 AM IST
Highlights

ట్రంప్ పాలనలో పెరిగిన పేదరికం, అసమానత: ఐరాస!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఆ దేశంలో పేదరికం మరియు అసమానతలు ఎక్కువగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది. అయితే, ఈ వ్యాఖ్యలు నిజమైనవి కావని, రాజకీయ దురద్దేశంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసినవేనని ఐరాసకు అమెరికన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న నిక్కీ హేలీ అన్నారు.

న్యూయార్క్ యూనివర్సిటీ లా అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొఫెసర్ ఫిలిప్ ఆల్స్టన్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ధీటుగా స్పందించారు. ఆల్స్టన్ అమెరికా మొత్తం పర్యటించి చేసిన అధ్యయనం ప్రకారం, ఆ దేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, కానీ అసమానతపై మాత్రం విజయాన్ని సాధించలేకపోయిందని అన్నారు. అమెరికాలో పేదరికంలో పుట్టిన వారి జీనప్రమాణాలు ఇదివరకే బాగుండేవని ఆయన ఓ ఆంగ్ల టీవి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

సౌత్ కారోలీనాకు గవర్నర్‌గా పనిచేసిన హేలీ గడచిన రెండు రోజుల క్రితమే ఐక్య రాజ్య సమితి మానవహక్కుల కౌన్సిల్ (యూఎన్‌హెచ్ఆర్‌సీ) నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ట్రంప్ పాలనపై ఆల్స్టన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె చెప్పారు.

ఐరాస మానవ హక్కుల నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత హేలీ మీడియాతో మాట్లాడుతూ.. 'వెనెజువెలా, ఇరాన్‌లలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై తనను తాను మానవ హక్కుల కౌన్సిల్ అని చెప్పుకునే ఈ సంస్థ ఏమీ మాట్లాడలేకపోతోందని, కాంగో వంటి దేశాన్నికొత్త సభ్యురాలిగా చేర్చుకున్నప్పుడు ఇక అది మానవ హక్కుల కౌన్సిల్ అని చెప్పుకునే అర్హతనే కోల్పోతుంద'ని అన్నారు.

ఈ సంస్థ మానవ హక్కులకు నష్టమే చేస్తుందని, ఇది పూర్తిగా రాజకీయ పక్షపాతంతో పని చేస్తోందని చెప్పారు. తాము ఈ కౌన్సిల్ నుంచి తప్పుకుంటున్నామంటే అర్థం తాము మానవ హక్కుల పట్ల మా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కాదని హేలీ స్పష్టం చేశారు.

click me!