హైతీ అధ్యక్షుడి హత్య: అర్థరాత్రి ఇంట్లో కాల్చి చంపిన దుండగులు

Published : Jul 08, 2021, 09:05 AM IST
హైతీ అధ్యక్షుడి హత్య: అర్థరాత్రి ఇంట్లో కాల్చి చంపిన దుండగులు

సారాంశం

హైతీ దేశాధ్యక్షుడు జోవెనల్ మోయిస్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసంలోనే సాయుధ దుండగులు ఆయనను కాల్చి చంపారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోర్ట్ ఆప్ ప్రిన్స్: హైతీ దేశాధ్యక్షుడు జొవెనల్ మోయిస్ (53) తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రాకంర మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. తన ప్రైవేట్ నివాసంలో ఉన్న ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆయన భార్య మార్టినే మోయిస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

దేశాధ్యక్షుడు జొవెనల్ మోయిస్ హత్య జరిగిన విషయాన్ని తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ ధ్రువీకరించారు. సాయుధ కమాండో గ్రూప్ ఈ దారుణానికి పాల్పడిందని ఆయన చెప్పారు. అది విదేశీయుల గ్రూప్ అని అన్నారు. ఇంగ్లీష్, స్పానిష్ భాషలు మాట్లాడిన విదేశీయులు ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపించారు. ఇది విధ్వేషపూరితం, అమానుషం, ఆటవికమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ బాద్యతలను తానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తీవ్రమైన సమస్యలతో దేశం సతమతమవుతున్న తరుణంలో మోయిస్ 2015లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రజలు హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. తొలి దశ ఎన్నికలో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

2016లో జరిగిన రెండో దశ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దానిపై ప్రజలు ఆందోళనలకు దిగారు. తుదకు కోర్టు ఉత్తర్వులతో ఆయన 2017 ఫిబ్రవరిలో అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే, 2021 ఫిబ్రవరి 7వ తేదీతో ఆయన పదవీకాలం ముగిసిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే, తన పదవీ కాలం 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఉందని ఆయన వాదిస్తూ వచ్చారు. 

తన పదవీకాలంలో మోయిన్ స్థానిక సంస్థలు మొదలు పార్లమెంటు వరకు దేనికీ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం పార్లమెంటు కూడా లేదు. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం లేదు. దాంతో ఆయనపై వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. నాలుగేల్లలో ఏడుసార్లు ప్రధానులను మార్చారు. మూడు నెలల క్రితం నియమించిన ప్రస్తుత ప్రధాని క్లాడ్ జోసెఫ్ ను తొలగించి ఈ వారంలోనే ఏరియల్ హెన్రీని ప్రధానిగా నియమించడానికి సిద్ధపడ్డారు. 

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. పెట్రోలు ధరల పెరుగుదల, ఆర్థిక తిరోగమనం, అభద్రత ఆయన హత్యకు కారణమని భావిస్తున్నారు. ఆహారం, ఇంధనం కొరత తీవ్రంగా ఉంది. శాంతిభద్రతల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే